మండలాధీశులు కొలువు తీరేది నేడే
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

మండలాధీశులు కొలువు తీరేది నేడే

ఎంపీపీల ఎన్నిక లాంఛనమే

తెదేపా ఖాతాలో చల్లపల్లి, మోపిదేవి

ఈనాడు, అమరావతి

జిల్లాలో మండలాధీశులు శుక్రవారం కొలువు తీరేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 43 మండలాల్లో రెండు ఎంపీపీ పదవులు తెదేపాకు దక్కే అవకాశం ఉంది. ఎలాంటి సమీకరణాలు మారకపోతే తెదేపా ఆధిక్యంతో దక్కించుకోనుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో తెదేపా నుంచి గెలుపొందిన వారికి మండల పరిషత్తు అధ్యక్ష పదవులు దక్కనున్నాయి. మిగిలిన 41 మండలాల్లో వైకాపా నుంచి గెలుపొందిన వారే పీఠాన్ని అధిరోహించనున్నారు. కొన్ని మండలాల్లో జనరల్‌ స్థానాల్లో రిజర్వేషన్‌ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది. పూర్తిగా ఆయా నియోజకవర్గ బాధ్యులకు ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే ఎన్నికల ఖర్చు భరించిన అభ్యర్థులకు ఎంపీపీ పదవులు లభిస్తున్నట్లు పార్టీ వర్గాల కథనం. ఖర్చు చేయని అభ్యర్థుల నుంచి ఆ మేరకు ఎంపీటీసీలుగా గెలిచిన వారికి ఖర్చులు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఎంపీపీ పదవులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎంపీపీ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. పరిశీలన, ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్నవారిని ప్రకటిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో ముందుగా ఎంపీటీసీలుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్క నామినేషన్‌ దాఖలు అయితే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. రెండు అంతకన్నా ఎక్కువ ఉంటే.. చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహించి ఎంపీపీని ప్రకటిస్తారు. జిల్లాలో దాదాపు అన్నీ ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం ఎంపీటీసీల ప్రకారం వైకాపా 635 గెలుచుకుంది. తెదేపా 65, జనసేన 9, బీఎస్పీ 2, సీపీఐ, భాజపా ఒక్కొక్కటి, ఇతరులు నలుగురు గెలుపొందారు. మండలాల వారీగా పరిశీలన చేస్తే.. మోపిదేవిలో మొత్తం 9 ఎంపీటీసీలకు తెదేపా 6 గెలుచుకుంది. మూడు వైకాపా దక్కించుకుంది. ఇక్కడ తెదేపా ఎంపీపీ పదవిని దక్కించుకోనుంది. చల్లపల్లి పోరు ఆసక్తికరంగా మారింది. మొత్తం 15 స్థానాలు ఉండగా తెదేపా 8 దక్కించుకుంది. వైకాపా నుంచి ఏడుగురు గెలిచారు. తెదేపా నుంచి ఎవరైనా వైకాపాకు మద్దతు ఇచ్చినా.. గైర్హాజరైనా ఎంపీపీ పదవి గల్లంతు అయ్యే అవకాశం ఉంది. తెదేపా అభ్యర్థినే ఎంపిక కానున్నట్లు తెలిసింది.

జడ్పీపై ఉత్కంఠనే..!

జడ్పీ అభ్యర్థిత్వంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. వైకాపా అధిష్ఠానం ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదు. కానీ జిల్లాలో ఇద్దరు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుడ్లవల్లేరు నుంచి గెలుపొందిన పెడన నియోజకవర్గానికి చెందిన ఉప్పాల హారిక తనకే ఖరారైందని, గన్నవరం నియోజకవర్గం నుంచి ఉంగుటూరుకు చెందిన దుట్టా సీతారామలక్ష్మి తమకే వస్తోందని ప్రచారం చేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

మొత్తం మండలాలు: 49

ఎన్నికలు జరిగినవి: 43

నిలిచిపోయినవి: 06

మొత్తం ఎంపీటీసీలు: 812

ఏకగ్రీవాలు: 69

ఎన్నికలు జరిగినవి: 648

ఎంపీపీలు: తెదేపా 2, వైకాపా 41


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని