మనది అనేది ఏదీ..!
eenadu telugu news
Updated : 26/09/2021 05:11 IST

మనది అనేది ఏదీ..!

నేడు ప్రపంచ నదుల దినోత్సవం
ఈనాడు-అమరావతి

భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో కృష్ణానది మూడోది. నీటిప్రవాహం పరంగా తీసుకుంటే దేశంలో నాలుగోస్థానం పొందింది. స్వచ్ఛమైన నీటితో మొదలై సముద్రంలోకి కలిసే సమయానికి నీరు కలుషితమై మురికికూపంలా మారుతోంది. నదికి ఇరువైపులా ఎక్కడ చూసినా.. ప్లాస్టిక డబ్బాలు, కవర్లు, వివిధ రకాల వ్యర్థాలతో నిండి కనిపిస్తోంది. ఒకప్పుడు కృష్ణానదిని 258.9 చదరపు కిలోమీటర్ల రివర్‌బేసిన్‌, క్యాచ్‌మెంట్‌ ప్రాంతం మొత్తం పుష్కలంగా స్వచ్ఛమైన జలంతో నిండి ఉండేది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏటేటా నీటి అవసరాలు పెరుగుతుండగా.. ఉన్న నీరు కూడా కలుషితమైపోతూ.. తాగేందుకు, వ్యవసాయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో ఉండే వారంతా ఎక్కడికక్కడ నదిని కాలుష్యం చేస్తూ తాము కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారనే వాస్తవాన్ని గుర్తించడం లేదు.

314 కిలోమీటర్లు

ఇదీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణానది ప్రవహించే పరిధి. ఈ జీవనదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది

ఇళ్ల నుంచి మురుగు ఇలా నదిలోకి వస్తుంది


అనుసరణీయం

* గంగానది తీవ్రమైన కాలుష్యం కోరల్లో చిక్కుకోవడంతో 2014లో కేంద్ర ప్రభుత్వం రూ.2,958 కోట్ల బడ్జెట్‌ను గంగానది ప్రక్షాళనకు వెచ్చించాలని తీర్మానించింది. 2014 జులై నుంచి 2016 జులై వరకూ ఈ నిధులను వెచ్చించి గంగా శుద్ధిని మహాయజ్ఞంగా చేపట్టనున్నట్టు ప్రకటించారు.జ్ఞ

* 1977లో సింగపూర్‌ నదిని రికార్డు స్థాయిలో పదేళ్లలో అంచెలంచెలుగా శుభ్రం చేసిన విధానం ప్రపంచానికి ఆదర్శనీయం. ఒకప్పుడు చెత్తా, చెదారం, రసాయన వ్యర్థాలతో నిండిపోయిన సింగపూర్‌లోని నదిని పక్కా ప్రణాళికతో ప్రక్షాళన చేశారు. 1987 నాటికి నది పూర్తిగా కొత్తరూపును సంతరించుకుంది. నదీతీరంలో పరిశ్రమలు, ఇళ్లు, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరిగినా డ్రైనేజీకి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. నదిలో ఎలాంటి వ్యర్థాలూ కలవకుండా గట్టి చర్యలు చేపట్టారు. నది మీదుగా జరిగే వాణిజ్య ఆదాయాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా పర్యాటక ఆదాయానికి పెద్దపీట వేశారు. కృష్ణా నది ఒడ్డున అలాగే చేయాలి.

* విజయవాడ భవానీద్వీపం, ఇబ్రహీంపట్నం, ఇరువైపులా ఆధ్యాత్మిక ప్రాంతాలు, బోటు ప్రయాణాలు.. కలిసి నిత్యం వేల మంది కృష్ణానది మీదుగా సాగుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు వదలకుండా చర్యలు చేపట్టాలి.

విజయవాడలో నదీతీర ప్రాంతాల నుంచి వచ్చే మురుగును శుద్ధి చేయకుండానే నదిలోకి వదులుతున్నారు. కృష్ణా జలాల్లో ఈ కోలి వంటి బ్యాక్టీరియాలు ఉంటున్నాయి. విజయవాడలో మొత్తంగా 700కు పైగా మురుగునీటి అవుట్‌లెట్లు కృష్ణా నది, కాలువల్లో కలుస్తున్నాయి. వీటి ద్వారా కనీసం 64ఎంఎల్‌డీ మురుగునీరు కలిసిపోతోందని.. విజయవాడ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(స్పా)విద్యార్థులు అధ్యయనం చేసి మూడేళ్ల క్రిందే లెక్క కట్టారు. మార్కెట్లు, మాంసం దుకాణాలు, హోటళ్లు, వసతి గృహాలు, చేపల బజార్లలో వచ్చే వ్యర్థాలను.. తెచ్చి కృష్ణా నదిలో పడేస్తున్నారు.


కాలువల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు

కొబ్బరి బోండాలు, కూరగాయల వ్యర్థాలు, చెప్పుల తయారీ వ్యర్థాలు, ప్లాస్టిక్‌, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నదిఒడ్డున వేయడంతో అది క్రమంగా నదిలోకి కలుస్తోంది. గణేశ్‌ విగ్రహాల వల్ల నీటిలో కృత్రిమ రంగులు, క్రోమియం, సీసం, వంటివి కలుస్తున్నట్లు వెల్లడైంది. నీటిలో బీవోడీ (బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) ఎక్కువగా నమోదైంది. ఇది గరిష్ఠంగా 1 వరకు ఉండొచ్ఛు చాలా ఎక్కువగా వస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని