ఆంధ్రులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
eenadu telugu news
Published : 28/09/2021 03:21 IST

ఆంధ్రులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

శంకర్‌ విలాస్‌ కూడలి వద్ద శవయాత్ర చేస్తూ నిరసన ప్రదర్శన  

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: ఏపీ విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రులకు తీరని అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు విమర్శించారు. భారత్‌ బంద్‌లో భాగంగా శంకర్‌ విలాస్‌ కూడలి వద్ద సీపీఐ నాయకులు ప్రధాని మోదీ శవయాత్ర పేరిట సోమవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతూ వేలాది మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను నడిరోడ్డుపై పడేసిందన్నారు. విలువైన ప్రభుత్వ రంగ ఆస్తులను అంబానీ, అదానీలకు కట్టబెడుతుందని, వ్యవసాయ రంగాన్ని సైతం ప్రైవేటుపరం చేసి దోచుకోవడమే లక్ష్యంగా భాజపా ముందుకెళ్తుందన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు తొమ్మిది నెలలుగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాష్ట్రంలోని పోర్టులను అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రక్రియను కేంద్ర ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, జిల్లా కార్యదర్శి ముసునూరు రమేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, నగర కార్యదర్శి మాల్యాద్రి, సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, విద్యార్థి నాయకులు, ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని