అనుబంధాన్ని కడతేర్చిన అనుమానం
eenadu telugu news
Published : 17/10/2021 03:06 IST

అనుబంధాన్ని కడతేర్చిన అనుమానం

పంట పొలంలో భార్యపై దాడి

అప్పాపురంలో భర్త కిరాతకం

మృతి చెందిన బుజ్జి

అప్పాపురం (నాదెండ్ల), న్యూస్‌టుడే: అగ్ని సాక్షిగా ఒక్కటైన ఆ జంట పచ్చని సంసారంలో అనుమానం చిచ్చు లేపింది.. పంట పొలంలో కిరాతకంగా కట్టుకున్నదాన్ని కడతేర్చాడు ఓ భర్త.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం బెడిసికొట్టింది.. పోలీసుల వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం అప్పాపురానికి చెందిన బుజ్జి(35)కి వట్టిచెరుకూరు మండలం చౌపాడు వాసి కిరణ్‌తో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఏడాది క్రితం అప్పాపురం వలసొచ్చారు. ఇక్కడే ఉంటూ.. పొలం పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం అంటగట్టి తరచు వివాదానికి దిగుతున్నాడు. తాగిన మైకంలో ఆమెను చిత్రహింసకు గురిచేసేవాడు. రెండు పర్యాయాలు కుటుంబ పెద్దలు నచ్చజెప్పారు. ఇదే వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. పెద్దల జోక్యంతో కేసు లేకుండా రాజీ పెట్టినప్పటికీ అతని మనసులో గూడుకట్టుకున్న అనుమానం కర్కోటకునిగా మార్చింది. శనివారం ఉదయం వారిద్దరూ కలిసి మిరప పొలంలో పురుగుల మందు వేసేందుకు వెళ్లారు. పెట్రోలు కోసమని మధ్యాహ్నం ఇంటికొచ్చిన భర్త తిరిగి పొలం వెళ్లాడు. ఇంతలో తన భార్య అపస్మారక స్థితిలో పడిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. విగతజీవిగా మారిన ఆమెను గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

రాయితో కొట్టి చంపాడు..

భార్యపై అనుమానం నేపథ్యంలో పొలంలో మరోసారి గొడవకు దిగిన కిరణ్‌ భార్యను కిరాతకంగా చంపినట్లు ఆమె సోదరుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాయితో తల వెనుక భాగంలో పలుమార్లు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. నిందితుడు తప్పించుకునేందుకే భార్య అపస్మారక స్థితిలో పడిపోయిందని చెబుతున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుజ్జి సోదరుడు ఏలియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు, నాదెండ్ల ఎస్సై సతీష్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులను విచారించారు. అనుమానితుడైన భర్త కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైద్య పరీక్షల కోసం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని