‘రాజకీయ లబ్ధికే వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం’
eenadu telugu news
Published : 18/10/2021 05:02 IST

‘రాజకీయ లబ్ధికే వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం’


మాట్లాడుతున్న పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు

లాడ్జిసెంటర్‌, గుంటూరు సిటీ, న్యూస్‌టుడే : నూతన వ్యవసాయ చట్టాలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వారు మాత్రమే దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాలు చేస్తున్నారని, నిజమైన రైతులెవ్వరూ పాల్గొనడం లేదని పొగాకు బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు పేర్కొన్నారు. గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘వ్యవసాయ సమస్యలు-సమాధానాలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో రఘునాథబాబు మాట్లాడుతూ గత 70 ఏళ్లలో పంట ఉత్పత్తులు పెరిగినా, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీనికి ప్రధాన కారణం పురుగు మందులు, ఎరువులు అధిక మోతాదులో వినియోగించడమేనన్నారు. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా, నాణ్యత తగ్గి ఎగుమతులకు అవకాశం లేకుండా పోయిందన్నారు. దీనిని నివారించడానికి నాణ్యత కలిగిన పంటను పండించడంతోపాటు అధిక పోషక విలువలు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రాంత చాలక్‌ ఎన్‌.హరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేసేలా ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని చెప్పారు. ఈ విధానంలో చేరడమనేది రైతుల ఇష్టానికే వదిలిపెడుతున్నట్లు చెప్పారు. సాగుదారులకు ఏ సమస్య వచ్చినా చట్టంలో దానికి పరిష్కారం చూపించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో నూతన వరవడి రాబోతుందని, పూర్తిగా యాంత్రీకరణ విధానంలో ఉంటుందన్నారు. ఆహార ఉత్పత్తుల తయారీకి కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ నాయకులు రాంబాబు, కుమారస్వామి, ఎ.కృష్ణప్రసాద్‌, జూపూడి రంగరాజు, వైవీ సుబ్బారావు, యడ్లపాటి స్వరూపరాణి, వి.గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని