100 రోజుల్లో స్వచ్ఛంగా..
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

100 రోజుల్లో స్వచ్ఛంగా..

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే

పంచాయతీలకు సరఫరా చేసిన చెత్త అటోలు

జిల్లాలోని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం (ఏపీ క్లాప్‌)ని ప్రవేశపెట్టింది. ఈనెల 20న జిల్లా స్థాయిలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. 100 రోజుల్లో గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించి జిల్లాకు పంపింది. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలను నిర్దేశించింది. ప్రతి రోజూ ఆయా గ్రామ పంచాయతీల్లో చేసిన కార్యక్రమాలను జగనన్న స్వచ్ఛ సంకల్పం (జేఎస్‌ఎస్‌) మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో శుక్రవారం నుంచి స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2022, జనవరి 26వ తేదీ వరకు స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం నిర్వహిస్తారు. పది రోజులకు చేయాల్సిన పనులను ప్రభుత్వం నిర్దేశించింది.

* అక్టోబరు 19న లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో ఆ రోజు నుంచి 10వ రోజు వరకు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి స్వచ్ఛ గ్రామాల ఏర్పాటులో వారి భాగస్వామ్యం గురించి తెలియజేసి తమ వంతు బాధ్యతలను నిర్వహించేలా చూస్తారు.

107 వాహనాల పంపిణీ
స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఈనెల 20న నిర్వహించిన కార్యక్రమంలో మొదటి దశలో 107 ఆటోలు, 20 ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. వీటిని ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలకు అదే రోజు పంపారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఆటోల్లోని రెండు భాగాల్లో వేరుగా వేస్తారు. దీనివల్ల తడి, పొడి చెత్తను సులభంగా వేరు చేసి ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ యూనిట్లలో పునరుత్పాదన చేయనున్నారు. మహిళలు రుతు క్రమంలో వినియోగించిన శానిటరీ నాప్‌కిన్లను ఇన్సినేటర్ల యంత్రంలో వేసి దానిని బూడిద చేస్తారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. జిల్లాపరిషత్తు సీఈవో చైతన్య, డీపీవో కేశవరెడ్డి జిల్లా స్థాయిలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. మండలాల్లో ఎంపీడీవోలు, ఈవోఆర్‌డీలు సంయుక్తంగా గ్రామాల్లో ఈ కార్యక్రమాలను పరిశీలించి క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచనలు చేస్తారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారు పని చేస్తున్న గ్రామాల్లోనే స్థానికంగా నివాసం ఉండి పనులు చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎక్కువ మంది ముఖ్య పట్టణాల్లో నివాసాలు ఉండి గ్రామాలకు విధులు హాజరవుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండి విధులు నిర్వహించేలా చూడాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు చేరుకోగలరు.
* 11 నుంచి 20వ రోజు వరకు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సి ఉంది.
21 నుంచి 30 వరకు వ్యర్థ పదార్థాల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి.
* 31 నుంచి 40 వరకు మానవ వనరులు, మెటీరియల్‌, మిషనరీని సమకూర్చుకోవాలి.
* 41 నుంచి 50 వరకు ప్రత్యేక సమూహాలతో ప్రచారం.
* 51 నుంచి 60 వరకు ద్రవ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాలి.
* 61 నుంచి 70 వరకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయాలి.
* 71 నుంచి 80 వరకు జల సంఘాలు ఏర్పాటు చేయాలి.
* 81 నుంచి 90 వరకు ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలి.
* 91 నుంచి 100వ రోజు వరకు గ్రామ పారిశుద్ధ్య కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆయా రంగంల్లో కృషి చేసిన ఛాంపియన్లను గౌరవించాలి.


సమన్వయంతో ముందుకెళ్తాం

జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అమలులో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకెళతాం. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పది రోజుల్లో చేయాల్సిన పనులు పూర్తి స్థాయిలో చేసేలా చూస్తాం. ప్రభుత్వం పంపిణీ చేసిన ఆటోలు, ట్రై సైకిళ్లు, ఇతర సామగ్రిని గ్రామ పంచాయతీలకు చేరవేశాం.

- చైతన్య, జిల్లాపరిషత్తు సీఈవో


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని