స్పందనకు వినతుల వెల్లువ
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

స్పందనకు వినతుల వెల్లువ

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జేసీ దినేష్‌కుమార్‌

స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. తొలుత ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించిన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి 10 ఫిర్యాదులు అందాయి. జేసీ దినేష్‌కుమార్‌ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నేరుగా విని సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. 11 గంటల నుంచి స్పందన కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జి.రాజకుమారి, అనుపమ అంజలి, కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో పి.కొండయ్య స్వీకరించారు. స్పందన అర్జీలను పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పెండింగ్‌ రుణాలివ్వాలి
ఎస్పీ కార్పొరేషన్‌ నుంచి మంజూరైన ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పెండింగ్‌ రుణాలు ఇవ్వాలని కోరుతూ కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం ‘స్పందన’లో అర్జీ అందించారు. 2017-18లో ఎస్సీ కార్పొరేషన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం ద్వారా నిధులు లేక జిల్లాలో 53 మందికి రుణాలను ఆపారని, నిధులు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్‌ వచ్చి ఆగిపోయాయన్నారు. ఇటీవల నిధులు విడుదల చేస్తూ సర్క్యులర్‌ ఇచ్చిన నేపథ్యంలో వారికి రుణాలు మంజూరు చేయాలని కోరారు. రుణాలను తక్షణం మంజూరు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్‌, లబ్ధిదారులు ఆండ్రియా, బ్రహ్మానందం, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, సింగారావు తదితరులు పాల్గొన్నారు.


అధికారులు ప్రొటోకాల్‌ పాటించడంలేదు..

చొప్పర ప్రీతి (కొలకలూరు సర్పంచి)

వైకాపా ప్రభుత్వం మహిళా పక్షపాతి అని చెప్పుకోవడం మాత్రమేనని, వాస్తవంలో దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెనాలి మండలం కొలకలూరి సర్పంచి డాక్టర్‌ చొప్పర ప్రీతి అన్నారు. ఇటీవల వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమానికి తనను ఆహ్వానించి వేదికపైకి పిలవకుండా ఎంపీటీసీ సభాధ్యక్షత వహించారని తెలిపారు. జనసేన తరపున గెలుపొందానని తనను వేదికపైకి రానివ్వకుండా అధికార పార్టీ నేతలే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని, ముగింపు సమయంలో మాత్రమే తనను వేదికపైకి ఆహ్వానించారన్నారు. ప్రొటోకాల్‌ పాటించని అధికారుల తీరుపై ఆమె స్పందనలో ఫిర్యాదు చేశారు.  


వికలాంగ పింఛను ఇప్పించరూ..

కొమ్మనబోయిన బల్లారావు (వెనిగండ్ల)

వికలాంగ పింఛను ఇప్పించాలని కోరుతూ పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన కొమ్మనబోయిన బల్లారావు స్పందనలో అర్జీ పెట్టుకున్నారు. వికలాంగ ధ్రువపత్రం ఉందని సచివాలయం వద్దకు వెళ్లి అడిగితే విద్యుత్తు బిల్లులో ఎక్కువ యూనిట్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అందుకు విద్యుత్తు శాఖ ఇచ్చిన లెటర్‌ను చూపించినా పింఛను దరఖాస్తు నమోదుకు అధికారులు లేనిపోని కారణాలు చెబుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి తనకు వికలాంగ పింఛను మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారు బల్లారావు.


పంచాయతీ రోడ్డులో నడవరాదని ఆంక్షలు

ఇమ్మడి రామారావు (జొన్నలగడ్డ)

ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్డులో నడిచేందుకు వీల్లేదని, కాల్వలోకి నీరు పోకుండా స్థానికులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుంటూరు రూరల్‌ మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఇమ్మడి రామారావు స్పందనలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని రజకుల బజార్‌లో ఉంటున్నామని, ఇటీవల కొందరు ఆ బజారులో నడవకూడదని, ఇంట్లో ఉపయోగించుకున్న వృథా నీరు కాల్వలోకి రాకుండా అడ్డు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని