పాల శీతలీకరణ భవన నిర్మాణాలు పూర్తిచేయండి
eenadu telugu news
Published : 27/10/2021 03:42 IST

పాల శీతలీకరణ భవన నిర్మాణాలు పూర్తిచేయండి

వీసీ నిర్వహిస్తున్న కలెక్టర్‌ నివాస్‌, వేదికపై జేసీలు శివశంకర్‌, మోహన్‌కుమార్‌ తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జగనన్న పాల వెల్లువ పథకం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్దేశించిన నమూనాల ప్రకారం బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్ర భవనాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో పూర్తి కావొచ్చిన భవనాలను పరిశీలించి, నివేదిక అందజేయాలన్నారు. మిగిలిన గ్రామాలకు అందుబాటులో ఉండేలా భవన నిర్మాణాలకు స్థల సేకరణ చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని పేర్కొన్నారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ తదితర భవనాల నిర్మాణాల పురోగతిపై సమీక్షించి, త్వరగా పూర్తి చేయాలన్నారు. వీసీలో జేసీలు ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌, పీఆర్‌ ఎస్‌ఈ వీరాస్వామి, ఐసీడీఎస్‌ పీడీ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.  

ప్రతి రూట్‌లో సగటున 1,433 లీటర్ల పాల సేకరణ
జగనన్న పాల వెల్లువ పథకం కింద జిల్లాలో పాల సేకరణ జరిగే గ్రామాలతో పాటు, బల్క్‌ మిల్కు కూలింగ్‌ యూనిట్‌ (బీఎంసీయూ)లను మ్యాపింగ్‌ చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని విడిది కార్యాలయంలో మంగళవారం పాల వెల్లువ పథకంపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ముందుగా రూట్లను గుర్తించాలని, ప్రతి రూట్‌లో సగటు పాల సేకరణ 1,433 లీటర్లుగా ఉండాలనేది ఒక అంచనాగా ఉన్నట్టు తెలిపారు. పాల సేకరణ జరిగే గ్రామం నుంచి ప్రొక్యూర్‌మెంట్‌ పాయింట్‌ వరకు సగటున 46 కి.మీ. దూరం ఉంటుందని అంచనా వేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో ప్రాథమికంగా 717 బీఎంసీయూలను గుర్తించామని, మ్యాపింగ్‌ పూర్తయితే ఈ సంఖ్య తగ్గవచ్చనీ, ఎక్కడ ఎక్కువగా పాలను సేకరించే గ్రామాలుంటే.. అక్కడ వీటిని ఏర్పాటు చేయాలన్నారు. జేసీ కె.మాధవీలత మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించడం ద్వారా గ్రామాలను గుర్తించి, బల్క్‌ మిల్క్‌ యూనిట్లను ప్రతిపాదించాలని చెప్పారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ విద్యాసాగర్‌, డీడీలు గోపిచంద్‌, రత్నశ్రీ, ఉమ, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని