Published : 05/05/2021 02:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వేళ.. కాసుల వేట

శ్మశానవాటికలో గుంత తవ్వేందుకు రూ.10 వేలు

ధర్మవరం శ్మశానవాటికలో గుంత తీస్తున్న పొక్లెయిన్‌

ధర్మవరం, న్యూస్‌టుడే: కరోనా మరణాలు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ధర్మవరం హిందూ శ్మశానవాటికలో పొక్లెయిన్‌తో గుంత తీసేందుకు రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ఆంబులెన్స్‌ వాహనం నుంచి మృతదేహాన్ని గుంత వరకు మోసుకెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.4 వేలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ పనిచేసే మున్సిపల్‌ ఉద్యోగి ఒకరికి అదనంగా రూ.2 వేలు ముట్టజెప్పాల్సి ఉంటుంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని పూడ్చాలంటే రూ.20 వేలు ఖర్చవుతోంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా కరోనాతో మృతి చెందితే శ్మశానవాటికలో పూడ్చాలంటే తలకుమించిన భారం అవుతోంది. శ్మశానవాటికలో ప్రైవేటు వ్యక్తులు వసూళ్ల దందాకు దిగారు. 15 రోజులుగా ఈతంతు జరుగుతున్నా అరికట్టాల్సిన మున్సిపల్‌ అధికారులు చోద్యం చూస్తున్నారు. నిబంధనల ప్రకారం మున్సిపల్‌ అధికారుల అనుమతి లేనిదే పొక్లెయిన్‌ యంత్రం శ్మశాన వాటికలో పనిచేయరాదు. మున్సిపల్‌ ఉద్యోగి ఒకరు కుమ్మక్కు అవడంతో వసూళ్ల దందాకు తెరలేపారు. రాత్రివేళ మృతదేహం ఖననం చేయాలంటే గుంత తీసేందుకు రూ.15 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జునను వివరణ కోరగా విచారించి తగు చర్యలు చేపడతామన్నారు. మున్సిపల్‌ ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని