బకాయిరూ. కోట్లు.. పాలికల్లో చీకట్లు!
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

బకాయిరూ. కోట్లు.. పాలికల్లో చీకట్లు!

పురపాలక కార్యాలయాల్లో నిలిచిన సేవలు

సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌ఛార్జి కమిషనర్‌ మురళీధర్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, అనంత విద్యుత్తు: విద్యుత్తు బకాయిలు, నెలవారీ బిల్లులు చెల్లించని కారణంగా జిల్లాలోని కళ్యాణదుర్గం, పుట్టపర్తి, తాడిపత్రి, పెనుకొండ, మడకశిర, పామిడి, గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీలకు సరఫరా నిలిపేశారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం, పుట్టపర్తి పురపాలికల్లో విద్యుత్తును పూర్తిగా ఆపేశారు. దీంతో అన్నిరకాల సేవలు నిలిచిపోయాయి. అధికారులు, సిబ్బంది అత్యవసర సేవల నిమిత్తం ఇతర కార్యాలయాలు, సచివాలయాలు, ఆలయాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. వివిధ అవసరాల నిమిత్తం మున్సిపల్‌ కార్యాలయాలకు వస్తున్న ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆన్‌లైన్‌ సేవలన్నీ నిలిచిపోయాయి. అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. మంగళవారం అనంత నగరపాలక కార్యాలయానికి సరఫరా నిలిపేయడంతో కమిషనర్‌ మూర్తి కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కలెక్టరు స్పందించి విద్యుత్తు అధికారులతో మాట్లాడగా.. సరఫరాను పునరుద్ధరించారు.

సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఆధునిక సాంకేతిక అందుబాటులోకి రావడంతో మున్సిపాలిటీల్లోని పౌర సేవలకు సంబంధించి అన్ని ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, పన్ను చెల్లింపులు, ఆస్తి పత్రాల జారీ, కొళాయి కనెక్షన్లు, ట్రేడ్‌ లైసెన్సుల జారీ, పునరుద్ధరణ, సాల్వేన్స్‌ సర్టిఫికెట్లు, ఆస్తుల మ్యుటేషన్‌, టెండర్‌ ప్రక్రియ వంటి సేవలు ఆన్‌లైన్‌ ద్వారానే అందిస్తున్నారు. దీంతోపాటు ఆయా మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనుల బిల్లులు ఎప్పటికప్పుడు సీఎఫ్‌ఎంస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరు వేయాలి. ఇవన్నీ సకాలంలో అందాలంటే నిరంతర విద్యుత్తు సరఫరా తప్పనిసరి. ప్రస్తుతం పలుచోట్ల సరఫరా కట్‌ చేయడంతో సేవలు నిలిచిపోయాయి. పన్నుల చెల్లింపులు సకాలంలో చేయకపోతే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. విద్యుత్తు కోతల వల్ల తాము జరిమానాలు కట్టాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

రూ.163 కోట్ల బకాయిజిల్లాలోని పురపాలికలు, నగర పంచాయతీలు కలిపి సుమారు రూ.163 కోట్ల మేర విద్యుత్తు శాఖకు బకాయి చెల్లించాల్సి ఉంది. నోటీసులు ఇచ్చినా చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేశారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్తు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అన్ని కేటగిరీ సర్వీసులు కలిపి 16,01,831 ఉండగా.. వీటిలో 4,14,406 సర్వీసులకు సంబంధించి రూ.2137.71 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

ఉద్యోగులకు ఉక్కపోత

పుట్టపర్తి పంచాయతీ కార్యాలయానికి విద్యుత్తు నిలిపేయడంతో ఇన్‌ఛార్జి మున్సిపల్‌ కమిషనర్‌ మురళీధర్‌ సమీపంలోని సచివాలయానికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో సరఫరా లేకపోవడంతో ఉద్యోగులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈమె పేరు సుకన్య. ఉరవకొండ మండలం మరుట్ల గ్రామం. కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రిలో ఏడు నెలల కిందట ప్రసవం పొందింది. ప్రస్తుతం బాబు ఆర్ద్యాకు సంబంధించి జనన ధ్రువీకరణ పత్రం పొందేందుకు కళ్యాణదుర్గం మున్సిపల్‌ కార్యాలయానికి భర్తతో కలిసి వచ్చింది. కార్యాలయంలో విద్యుత్తు సరఫరా లేకపోవటంతో ధ్రువీకరణ పత్రం ఇవ్వడం సాధ్యం కాదని ఉద్యోగులు చెప్పారు. వ్యయప్రయాసలకు ఓర్చి కార్యాలయానికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్లులు చెల్లించాల్సిందే

- నాగరాజు, ఎస్‌ఈ, విద్యుత్తుశాఖ

బకాయిలు, నెలవారీ బిల్లు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చాం. ఆయా అధికారులను నేరుగా కలిసి కోరాం. సంబంధిత శాఖల అధికారులు స్పందించలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కువ బకాయిలున్న మున్సిపల్‌, పంచాయతీ కార్యాలయాలకు సరఫరా నిలిపివేశాం. కొంతమంది ఇబ్బంది ఉందని, త్వరలో చెల్లిస్తామని లేఖలు ఇచ్చారు. అలాంటి వాటికి సరఫరాను పునరుద్ధరిస్తున్నాం.

ఇది కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయం. రూ.6.79 కోట్ల బకాయి ఉండటంతో 17 రోజుల కిందట విద్యుత్తు అధికారులు సరఫరా నిలిపివేశారు. ఉద్యోగులు ఇతర కార్యాలయాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వివిధ సేవలు నిమిత్తం వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం తాత్కాలికంగా పునరుద్ధరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని