Published : 21/04/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాజమాన్య పద్ధతులపై అవగాహన అవసరం


విశ్వవిద్యాలయ అధికారులను సత్కరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

 

తిరుపతి(పశువైద్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: నూతన వంగడాలను రూపొందించే సమయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడలను తట్టుకునేలా ప్రత్యేక అవసరాలు, యాజమాన్య పద్ధతులను రూపొందిస్తారని, వాటిని అనుసరించి రైతులు సాగు చేయాల్సి ఉంటుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.త్రిమూర్తులు, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ రాంబాబు అన్నారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో రెండు రోజుల పాటు నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం మంగళవారం ముగిసింది. వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి పర్యవేక్షణలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, పరిశోధన స్థానాల అధిపతులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు బృందాలుగా ఏర్పడి రైతుల సమస్యలు, వాటికి వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, వారి సూచనల మేరకు 2021-22 సంవత్సరానికి గాను చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలపై చర్చించారు. చర్చల ఫలితాలను పంటలు, విభాగాల వారీగా నివేదించారు. ఈ నివేదికపై వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ త్రిమూర్తులు, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ రాంబాబు నిశితంగా చర్చించి నివేదికల్ని స్వీకరించారు. రాష్ట్రస్థాయిలో అందిన నివేదికల్ని క్రోడీకరించి రానున్న ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో రైతులకు అందించాల్సిన సహాయ సహకారాల్ని నిర్ణయించి అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని రకాల నూతన వంగడాలపై రైతులు అనుమానం వ్యక్తం చేయడంతో వాటిని ఎవరి పర్యవేక్షణలో సాగు చేశారని శాస్త్రవేత్తలు ప్రశ్నించగా.. సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని విత్తనాలు సేకరించి సాగు చేసినట్లు రైతులు సమాధానం ఇచ్చారు. నూతన వంగడాల విషయంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు స్వీకరించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు సమాధారం ఇచ్చారు. ప్రతి ఏటా పదవీవిరమణ చేయనున్న సీనియర్‌ శాస్త్రవేత్తలను సత్కరించే ఆనవాయితీలో భాగంగా తిరుపతి పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుబ్బారావు, మారుటేరు పరిశోధనస్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ పి.రమేష్‌బాబును అధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎం.వి.రమణ, పద్మోదయ, కలీముల్లా, శాంతిప్రియ, శ్రీలత, రాజశేఖర్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని