రెక్కలలెక్కలకష్టమా ?
eenadu telugu news
Published : 16/09/2021 05:36 IST

రెక్కలలెక్కలకష్టమా ?

త్వరలో క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందం పర్యటన

 150 రోజుల్లో1.43 కోట్లపనిదినాలు 

ఉపాధి హామీలో విస్మయకరంగా గణాంకాలు

న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ)

కూలీల రెక్కల కష్టమో లేక సిబ్బంది లెక్కల కష్టమోగానీ జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పనుల లెక్క మాత్రం విస్మయం కలిగిస్తోంది. ఐదు నెలల్లో.. 150 రోజుల్లో 1,43,62,181 పనిదినాలు పూర్తి చేశారు. రోజుకు సగటున లక్షకు అటూఇటుగా జిల్లాలో క్రమం తప్పక కూలీలు పనికి హాజరైతేనే ఈ లెక్క సాధ్యం. మరి ప్రతిరోజూ జిల్లాలో లక్షకు తగ్గకుండా కూలీలు పనికి హాజరయ్యారా..? రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ఇలాంటి పరిస్థితే ఉండటంతో క్షేత్రస్థాయిలో వాస్తవాల పరిశీలనకు కేంద్ర బృందం త్వరలో రాష్ట్రానికి రానుండగా, జిల్లాలోనూ కేంద్ర బృందం పర్యటించనుందన్న అంచనాతో డ్వామా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.-

జిల్లాలో కార్వేటినగరం, కుప్పం, ములకలచెరువు, నగరి, సత్యవేడు మండలాల్లో అత్యధికంగా ఐదు నెలల్లో ఒక్కో మండలంలో మూడు లక్షలకు పైగా పనిదినాలు పూర్తిచేసినట్లు లెక్క చూపారు. కరవు ప్రాంతమైన తంబళ్లపల్లి మండలంలో 2.88 లక్షల పనిదినాలే నమోదయ్యాయి. 26 పంచాయతీలున్న యాదమరి మండలంలో 1.05 లక్షల పనిదినాలు మాత్రమే నమోదయ్యాయి. జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 1,20,67,863 పనిదినాలు కల్పించగా, 2020-21లో 1,96,38,668 పనిదినాలు నమోదయ్యాయి. 2021-22లో ఐదు నెలల వ్యవధిలో ఏకంగా 1,43,62,181 లెక్క చూపారు. ఇటీవలి వర్షాలకు జిల్లాలో 70 శాతం చెరువులు నిండాయి. దీంతో సామూహికంగా కూలీలు పెద్దఎత్తున పనులు చేసే పరిస్థితి లేదు. రైతులకు సంబంధించిన వ్యక్తిగత పనుల్లో ఇంత భారీ సంఖ్యలో పనిదినాలు నమోదయ్యే అవకాశం లేదు. మరి ఇన్ని పనిదినాలు ఎలా సాధ్యమో పనిచేసిన వారికే తెలియాలి.

2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు కేటాయించిన ఉపాధి హామీ పనిదినాల లక్ష్యం 1.50 కోట్లు. ఈ నెల 13 నాటికి పూర్తయిన పనిదినాలు 1,43,62,181. ఉపాధి పథకం ప్రారంభమైన నాటి నుంచి ఎప్పుడూ లేనంత వేగంగా పనిదినాలు కలిగించడం ఈసారి ఎలా సాధ్యమైందన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

పని కోసమా..? నిధి కోసమా?

ఉపాధి హామీ పథకంలో 40 శాతం నిధులు వస్తు సామగ్రి నిధి కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ ఏడాది దీనికింద జిల్లాకు రూ.186.22 కోట్లు మంజూరయ్యాయి. కూలీల పనిదినాలు ఎంతగా పెరిగితే అంతగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతాయన్న ఆలోచనతోనూ పనిదినాలు ఎక్కువగా లెక్క చూపుతున్నారని, యంత్రాలతో పని చేయించి, కూలీల పేరిట బిల్లులు మంజూరు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవలి సామాజిక తనిఖీల్లో ఇలాంటి ఫిర్యాదులు పలు ప్రాంతాల్లో అధికారుల దృష్టికి వచ్చాయి. నరేగాలో ఏటా కేటాయించే పనిదినాలను డిసెంబరు లోపు వినియోగించుకుని అదనపు కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదిస్తారు. జనవరి-మార్చి మధ్య కాలానికి మరికొంత లేబర్‌ బడ్జెట్‌ను కేంద్రం కేటాయిస్తుంది. 2021-22కు గాను జిల్లాకు కేటాయించిన 1.5 కోట్ల పనిదినాలు ఇప్పటికే దాదాపు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో పనులకు హాజరవుతున్న మొత్తం 5,20,554 కుటుంబాల్లో ఇప్పటికే 31,463 కుటుంబాలు వంద రోజుల పనిదినాల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు సమాచారం పంపారు. ఒక్కో కూలీ సగటున రోజుకు రూ.233 వేతనం పొందుతున్నట్లు పేర్కొన్నారు.

..పదేళ్లలో ఇలా

సంవత్సరం  పనిదినాలు

2011-12 1,35,51,434

2012-13 1,27,09,527

2013-14 1,18,42,975

2014-15 1,02,15,347

2015-16 1,27,96,264

2016-17 1,31,95,299

2017-18 1,51,78,570

2018-19 1,75,64,207

2019-20 1,20,67,863

2020-21 1,96,38,668

2021-22 1,43,62,181.

(5నెలల్లో)


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని