అధికార పార్టీదే హవా..!
eenadu telugu news
Published : 20/09/2021 04:46 IST

అధికార పార్టీదే హవా..!

33 జడ్పీటీసీ  స్థానాలూ వైకాపాకే 

ఎంపీటీసీ  స్థానాల్లోనూ గెలుపు 

 ఈనాడు-తిరుపతి, ఈనాడు డిజిటల్, చిత్తూరు, న్యూస్‌టుడే, చిత్తూరు (జడ్పీ)

చంద్రగిరిలో పరిశీలిస్తున్న  ఎస్పీ వెంకట అప్పలనాయుడు కుప్పంలో ఓట్ల లెక్కింపు..

జిల్లా పరిషత్‌ ఫలితాలు ఏకపక్షమయ్యాయి. జడ్పీటీసీ స్థానాలన్నింటినీ వైకాపా సొంతం చేసుకుంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా అధికార వైకాపా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని.. ఎన్నికల బరి నుంచి తాము తప్పుకొంటున్నట్లు నాడు తెదేపా అధినేత ప్రకటించిన విషయం   తెలిసిందే. క్షేత్రస్థాయిలో కొందరు పార్టీ అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసినా పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో వైకాపా ఏకగ్రీవంగా 30 జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోగా.. తాజాగా మిగిలిన 33 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

చిత్తూరులో డిక్లరేషన్‌ పత్రాలు చూపుతున్న విజేతలు

జిల్లా పరిధిలోని 11 కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే అధికార పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తలేదు. ప్రత్యేక అధికారుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన.. బ్యాలెట్‌ పెట్టెలను బయటకు తీసుకొచ్చి అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో తెరిచారు. కొన్నిచోట్ల పోటీ చేసిన తెదేపా, భాజపా, జనసేన అభ్యర్థులు సైతం లెక్కింపు కేంద్రాల వద్దకు రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్దగా సందడి లేదు. 
ఆ వ΄డుచోట్ల సందడి లేదు..  జిల్లాలోని 14 నియోజకవర్గాలకుగాను వ΄డుచోట్ల ఎన్నికలే జరగలేదు. పుంగనూరు, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల సందడి కనిపించలేదు.

ఐరాల తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి తరఫున జనరల్‌ ఏజెంట్‌గా వ్యవహరించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఒకరు పూతలపట్టులోని పి.కొత్తకోట గురుకుల పాఠశాల కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వచ్చి అధికారులకు విన్నవించగా.. వారు తిరస్కరించారు. సదరు వ్యక్తి కర్ణాటకలో నివాసం ఉంటున్నారని.. ఆధార్‌ కార్డులో చిరునామా చిత్తూరు నగరంగా ఉండటంతో ఎన్నికల నిబంధనల మేరకు సిబ్బంది వెనక్కి పంపారు. కొవిడ్‌ నిబంధనల మేరకు లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని ఎస్‌ఈసీ ఆదేశించినా..  ఎక్కడా పాటించలేదు. జిల్లా ఎన్నికల పరిశీలకులు చినవీరభద్రుడు, ఎస్పీ సెంథిల్‌ కుమార్, జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్, శిక్షణ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్, ఆర్డీవో కనక నరసారెడ్డి ఓట్ల లెక్కింపును పరిశీలించారు.

ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌  ఎన్నికకు నోటిఫికేషన్‌

చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసిందని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికకు అధికారిక నోటిఫికేషన్‌ను ఇన్‌ఛార్జి కలెక్టర్‌ విడుదల చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24న ఎంపీపీల ఎన్నిక, 25న జడ్పీ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ జరగనుందని పేర్కొన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు సహకరించిన అధికారులు, పోలీసు యంత్రాంగం, రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జేసీ(ఆసరా) రాజశేఖర్, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

అత్యధికం..  అత్యల్పం

పలమనేరు నియోజకవర్గం వి.కోట జడ్పీటీసీ  వైకాపా అభ్యర్థి అత్యధికంగా 27,713 ఓట్ల ఆధిక్యత లభించింది. నాగలాపురం పరిధిలో వైకాపా అభ్యర్థి 505 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. 
 మరోవైపు జిల్లా పరిధిలోని బంగారుపాళ్యంతో పాటు కలకడ జడ్పీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 
ఏకగ్రీవాలు: జడ్పీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడి నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ తర్వాత జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో పుంగనూరు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి పరిధిలోని అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 
 ఏకగ్రీవమైన 30 జడ్పీటీసీ స్థానాలను వైకాపానే దక్కించుకోగా.. 433 ఎంపీటీసీ స్థానాల్లో 410 వైకాపా, తెదేపా 8, సీపీఐ 1, స్వతంత్రులు 14 మంది ఉన్నారు. 

తెదేపా సర్పంచి దుకాణంపై  వైకాపా నాయకుల దాడి

ధ్వంసమైన అద్దాలు

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పెద్దబంగారునత్తం తెదేపా సర్పంచి రోహిత్‌పై వైకాపా శ్రేణులు దాడి చేసి దుకాణంలోని వస్తువులు ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు. ఆదివారం పరిషత్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత జడ్పీటీసీ స్థానం వైకాపా అభ్యర్థి కైవసం చేసుకోవడంతో స్వగ్రామమైన పెద్దబంగారునత్తంలో సంబరాలు చేసుకున్నారు. పెద్దబంగారునత్తం ఎంపీటీసీ స్థానంలో వైకాపా ఓటమి చెందడంతో ఆగ్రహం చెంది తమ దుకాణంపై దాడి చేసినట్లు బాధితుడు రోహిత్‌ వాపోయారు. ఇరుపార్టీల నాయకులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఎస్సై ఉమామహేశ్వర్‌రెడ్డి సంఘటన స్థలానికి చెరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఈసారీ పశ్చిమానికే..!

ఈనాడు డిజిటల్, తిరుపతి


అత్యధిక ఆధిక్యం సాధించిన శ్రీనివాసులు

చిత్తూరులో బ్యాలెట్ల పరిశీలన 

జడ్పీ ఛైర్మన్‌ పదవి ఈసారీ జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసికే దక్కనుంది. ఆశావహులైన ఇద్దరూ ఇక్కడి వారు కావడంతో ఈ ప్రాంతం వారికి వరుసగా లభించనుంది. గతంలో  సుబ్రహ్మణ్యంరెడ్డి, రెడ్డెమ్మ,  గీర్వాణి వరుసగా పదవులు అలంకరించారు. ప్రస్తుతం వి.కోట జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన జి.శ్రీనివాసులు (వాసు) పేరు ఏడాదిన్నర కిందట స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలోనే వినిపించింది. భారతీ సిమెంట్్స కంపెనీలో ఆడిటర్‌గా పని చేస్తున్న ఈయన సోదరుడు బాలాజీ పలుకుబడితో పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో జిల్లాలో అత్యధిక ఆధిక్యం సాధించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం సదుం నుంచి జడ్పీటీసీగా ఏకగ్రీవమైన సోమశేఖర్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. తనకు మద్దతు ఇవ్వాలని శ్రీనివాసులు మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలో సోమవారం  కలవనున్నారని తెలిసిందే. ఆపై ఈ నెల 24న జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎవరు అధిష్ఠిస్తారో వెల్లడి కానుంది.
తొలుత ఎస్‌ఆర్‌పురం.. చివరగా కేవీబీపురం ఫలితం
జిల్లావ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. చిత్తూరు పీవీకేఎన్‌ కళాశాలలో కొంత ఆలస్యంగా మొదలైంది. ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడించారు. సాయంత్రం 5.30 గంటలకు లెక్కింపు పూర్తయింది. జడ్పీటీసీ స్థానాల్లో.. తొలుత ఎస్‌ఆర్‌పురం ఫలితం ప్రకటించారు. అక్కడ వైకాపా అభ్యర్థి ప్రసాద్‌రెడ్డి 11,691 ఓట్ల ఆధిక్యం సాధించారు. చివరగా సాయంత్రం నాలుగు గంటలకు కేవీబీపురం ఫలితం వెల్లడయింది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన ముణెమ్మ 6,546 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఫారాలు అందజేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని