కోరింగ..జీవ వైవిధ్యహారం
eenadu telugu news
Updated : 27/09/2021 04:17 IST

కోరింగ..జీవ వైవిధ్యహారం

వన్యప్రాణి సంరక్షణ కేంద్రం హద్దుల గుర్తింపు

న్యూస్‌టుడే, తాళ్లరేవు, మసీదుసెంటర్‌(కాకినాడ) : కాకినాడ సమీపంలోని కోరింగ అభయారణ్యం వివిధ రకాల జంతువులు, పక్షి, చేప జాతులకు ఆవాసం.. ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళికి రక్షణ కవచంగా నిలిచే మడ అడవులు ఇక్కడ విస్తరించాయి.. తాజాగా కోరింగ వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరిహద్దులను నిర్ధారిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కోరింగ రక్షిత అడవులు, దానికి అనుసంధానంగా ఉన్న అటవీప్రాంతం, 235.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన భైరవపాలెం రక్షిత అటవీప్రాంతం ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రలోకి వస్తుందని అందులో వెల్లడించారు. ఈ ప్రాంతంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేలా జోనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాల్సి ఉంది. ఎకోసెన్సిటివ్‌ జోన్‌ పర్యవేక్షణకు కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం కోరింగ మడఅడవులు సముద్రం వైపు 5 కి.మీ., దక్షణం వైపు 11 కి.మీ. విస్తరించాయని అధికారులు చెబుతున్నారు.

పక్షులు: మడ అడవుల్లో 272 పక్షి జాతులున్నాయి. అక్టోబరు నుంచి మార్చి వరకు మంగోలియా, రష్యా, సైబీరియా తదితర దేశాల నుంచి కోరంగి ఆభయారణ్యానికి పక్షులు వలస వస్తాయి. అలా ఇతర దేశాల నుంచి వచ్చేవి 92 రకాలు ఉన్నాయి. ఏటా వలస పక్షులను లెక్కిస్తారు.

మత్స్య జాతులు: కోరింగ ఆభయారణ్యంలో 610 రకాల మత్స్య జాతులున్నాయి. గోదావరి, సముద్రం కలిసే ముఖ ద్వారం వద్ద 300 రకాల చేపల రకాలను గుర్తించారు.

వన్యప్రాణులకు ఆవాసం: నీటిపిల్లి, నీటి కుక్క, నక్క వంటి జంతువులు ఇక్కడ ఆవాసం పొందుతున్నాయి. అభయారణ్యంలో 2018లో నీటి పిల్లిపై సర్వే నిర్వహించారు. మొత్తంగా 115 ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నీటి కుక్క

పర్యాటక కేంద్రం: కోరింగ ఆభయారణ్యం పరిధిలోని మడ అడవుల్లో పర్యాటక కేంద్రం సందర్శకులతో ఎంతో ఆకట్టుకుంటుంది. జిల్లాలో ఇది చూడాల్సిన ప్రదేశంగా పేరొందింది. ఇది కాకినాడకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణ రోజుల్లో 200 నుంచి 500 మంది, ఆదివారం 1,000 మంది, సంక్రాంతికి 10వేల మంది ప్రదర్శకులతో సందడిగా ఉంటుంది.

సముద్ర తాబేళ్లు: ఏటా సంతానోత్పత్తికి డిసెంబరు, ఏప్రిల్‌లో ఈ తీరానికి వస్తాయి. జనవరి, ఫిబ్రవరిలో ఎక్కువగా వస్తుంటాయి. 45 రోజులకు ఆలివ్‌రిడ్లే తాబేళ్లు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టే ప్రదేశాలను వన్యప్రాణి అధికారులు గుర్తించి, వాటికి రక్షణ కల్పిస్తారు. తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచి పెడతారు.

నాటుసారా తయారీ: కోరింగ అభయారణ్యంలోని సముద్ర తీరం వెంట మడ అడవులను ధ్వంసం చేసి నాటు సారా తయారీ చేపడుతున్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. 2020-21 సంవత్సరాల్లో ఎక్సైజ్‌, పోలీసు శాఖ ఆధ్వర్యంలో దాడులు చేసి లక్షలాది లీటర్ల బెల్లం ఊట, నాటుసారాను ధ్వంసం చేశారు.

 

ఎన్నో ప్రత్యేకతలు..

కోరింగ రక్షిత అటవీ ప్రాంతం అనేక ప్రత్యేకతల సమాహారమని చెప్పొచ్ఛు గోదావరి, సముద్రం కలిసే మిశ్రమ నీటి వ్యవస్థ ఉన్న చోట్ల మడ చెట్లు పెరగడానికి అనువైన ప్రదేశం. సమద్ర తీరంలో ఉన్న ఈ మడ అడవులు దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచాయి. సాధారణ వాటికంటే మడ చెట్లు పది రెట్లు ఎక్కువ ఆక్సిజన్‌ అందిస్తాయి. చేపల పునరుత్పత్తికి అనువైన ప్రదేశం. న ల్ల, తెల్ల, విల్వ మడ చెట్లు ఒకే చోట ఉండడం అరుదు. మడ చెట్టు 20 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది.

నీటి పిల్లి

రెండేళ్లలో పూర్తిచేస్తాం..

అన్ని డిపార్ట్‌మెంట్‌లు సంయుక్తంగా జోనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను రెండేళ్లలోపు పూర్తిచేస్తాం. దీనిపై ఇటీవల కాలంలో కేంద్రపరిధిలో సమావేశం నిర్వహించారు. కోరింగ మడ అడవులను రక్షించేందుకు ప్రొటెక్షన్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. అటవీప్రాంతం చుట్టూ ఉన్న పరిశ్రమలు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటున్నాయి. ఎవరైనా సముద్రంలో విషవాయువులు వదిలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మడ అడవులను నరికినా చర్యలు తప్పవు. -సెల్వం, డీఎఫ్‌వో, వన్యప్రాణి సంరక్షణ, రాజమహేంద్రవరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని