అందరి భాగస్వామ్యంతో ఆరోగ్యకర సమాజం
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

అందరి భాగస్వామ్యంతో ఆరోగ్యకర సమాజం

క్లాప్‌ లోగోను ఆవిష్కరిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని.. అందరి భాగస్వామ్యంతోనే అది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. జడ్పీ కార్యాలయం వద్ద జిల్లాలో 100 రోజులు నిర్వహించే క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ముందుగా క్లాప్‌ లోగోను ఆవిష్కరించి, జిల్లాకు కేటాయించిన 155 హైడ్రాలిక్‌ పవర్‌ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో పటిష్టమైన పారిశుద్ధ్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్లతో 1,000 వాహనాలను కొనుగోలు చేశారని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం జగన్‌ సంకల్పించారన్నారు. బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రోడ్లపై చెత్తను వేసే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సభలో కాకినాడ ఎంపీ వంగా గీత, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కొండేటి చిట్టిబాబు, సంయుక్త కలెక్టర్లు లక్ష్మీశ, కీర్తి, కుడా ఛైర్మన్‌ చంద్రకళాదీప్తి, చోడిపల్లి ప్రసాద్‌, డీపీవో నాగేశ్వర్‌నాయక్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని