అక్కడ వైద్యం భారం..ఇక్కడ వసతులు దూరం..
logo
Published : 17/05/2021 05:56 IST

అక్కడ వైద్యం భారం..ఇక్కడ వసతులు దూరం..

ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల లేమితో కష్టాలు


నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

న్యూస్‌టుడే, నరసరావుపేట పట్టణం : నరసరావుపేటలోని ఇస్లాంపేటకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌ సోకడంతో స్థానికంగా ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరాడు. రెండు వారాలు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ అని తేలటంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఆసుపత్రి సిబ్బంది అతని చేతిలో పెట్టిన బిల్లు చూసి ఆశ్చర్యపోయాడు. 14 రోజుల చికిత్సకు రూ.6 లక్షలు బిల్లు వేశారు. అప్పటికే మందులు, పరీక్షల కోసమని అతను మరో రూ.2 లక్షలు ఖర్చు చేశాడు.

నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కరోనాతో పల్నాడురోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరింది. సాధారణ బెడ్‌ ఇచ్చి రోజుకి రూ. 15 వేలు వసూలు చేశారు. వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందగా మందులు, పరీక్షలు అంటూ రూ.2 లక్షలు బిల్లు వేశారు. ఆమె కుటంబ సభ్యులు బిల్లు చెల్లించి ఇంటికి తీసుకెళ్లారు. రెండు రోజుల అనంతరం ఆమె ఆరోగ్యపరిస్థితి క్షీణించటంతో మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. గతంలో మాదిరిగా తాము బిల్లు కట్టలేమని ఆరోగ్యశ్రీలో వైద్యం అందించాలని కోరగా అందుకు నిరాకరించారు. తమ వద్ద ఆక్సిజన్‌ అందుబాటులో లేదని రోగిని చేర్చుకోకుండా వెనక్కు పంపారు.

నరసరావుపేట మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు వైరస్‌ సోకడంతో తెలిసిన వాళ్ల ద్వారా అరండల్‌పేటలోని ఓ ఆసుపత్రిలో చేరారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. కొవిడ్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఇక్కడ కొన్ని పడకలు ఏర్పాటు చేసి అనధికారికంగా చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ వైద్యం పొందిన దంపతుల నుంచి రూ.8లక్షలు వసూలు చేశారు. చివరికి భార్య మరణించగా భర్త బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు. రూ.లక్షలు తీసుకుని తన భార్యకు సక్రమంగా వైద్యం అందించలేదని ఆరోపిస్తూ ఆయన అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు అనధికారికంగా వైద్యం చేస్తున్నారని గుర్తించారు. ఇది జరిగి పదిరోజులైనా ఇంతవరకు ఆసుపత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

నాదెండ్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌ బారినపడి సత్తెనపల్లి రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి యాజమాన్యం ఇతని వద్ద నుంచి ఐదురోజుల చికిత్సకు రూ.3,38,300 ఫీజు వసూలు చేసింది. డిశ్ఛార్జి అయిన ఇతను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని గుర్తించి ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు.

కరోనాతో బాధపడుతూ సామాన్యుడు ఆసుపత్రికి వెళితే కనీసం రూ.3లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు తప్ప అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవటం లేదు. దీంతో వారు కరోనా ముసుగులో అందినకాడికి దోచుకుంటున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు ల్యాబ్‌లు, సీటీ స్కాన్‌ సెంటర్ల నిర్వాహకులు రెట్టింపు ఫీజు వసూలు చేస్తున్నారు.

జిల్లా కొవిడ్‌ ఉద్ధృతంగా ఉండడంతో ఈ పరిస్థితులను ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, సీటీ స్కానింగ్‌ కేంద్రాలు, ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నాయి. కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వం అనుమతించిన వైద్యశాలలు 100లోపు ఉంటే అనధికారికంగా పాజిటివ్‌ రోగులకు చికిత్స చేస్తున్న వైద్యశాలలు 400కు పైగా ఉన్నాయి. ప్రైవేటు ల్యాబ్‌లు, సీటీస్కాన్‌ నిర్వాహకులతో పాటు ఆర్‌ఎంపీలు అనధికారికంగా చికిత్స చేస్తున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వైద్యఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి.

ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రిలో..

ఎన్నెస్పీ కాలనీలోని కొవిడ్‌ ఆసుపత్రిలో 200 పడకలు అందుబాటులోకి తెచ్చారు. వైరస్‌ బారినపడిన వారు 200 మందికి పైగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి ప్రారంభించి నెలరోజులైనా ఇంతవరకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. ఇక్కడ చికిత్స కోసం వచ్చిన రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇక్కడ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. కొవిడ్‌ బాధితుల నుంచి నగదు తీసుకోవటంతో ఇప్పటికి ఐదుగురిని సస్పెండ్‌ చేశారు. పారిశుద్ధ్యం సక్రమంగా ఉండటం లేదు. రోగులకు సేవలు అందించే సిబ్బంది కొరతగా ఉంది.

సక్రమంగా సేవలు అందేలా చర్యలు

ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు సక్రమంగా సేవలు అందించేలా పర్యవేక్షణ పెంచుతాం. అధిక ఫీజులు వసూలు చేస్తుంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఖాళీ పోస్టులు తాత్కాలికంగా భర్తీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ రోగులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తా. - రోహిణి రత్నశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని