ఎన్నాళ్లీ ఎదురుచూపులు!
eenadu telugu news
Published : 04/08/2021 01:48 IST

ఎన్నాళ్లీ ఎదురుచూపులు!

జొన్న, మొక్కజొన్న రైతులకు అందని పంట డబ్బులు 

జిల్లాలో రబీ సీˆజన్‌లో జొన్న, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ప్రభుత్వం రెండు నెలలైనా  కర్షకుల ఖాతాలకు సొమ్ము జమ చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. జూన్‌ నెలలో విక్రయించినవారికి సైతం నేటికీ సొమ్ము జమకాలేదు. జిల్లాలో తుదివిడత కొనుగోలు చేసిన 10వేల మంది రైతులకు రూ.110కోట్ల సొమ్ము జమచేయాల్సి ఉంది. 

ఈనాడు, గుంటూరు కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువలకు నీటిని విడుదల చేయడం, సాగర్‌ కాలువలకు బుధవారం నీటిని విడుదల చేస్తుండటంతో సాగు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఖరీఫ్‌ పెట్టుబడులకు అక్కరకు వస్తాయన్న ఉద్దేశంతో పంటను ప్రభుత్వానికి అమ్మితే ఇప్పటికీ సొమ్ములు అందడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సాగు పనులు మొదలైతే విత్తనాలు, ఎరువులు కొనుగోలుతోపాటు భూమి పంట సాగుకు సిద్ధం చేయడానికి సొమ్ము అవసరమవుతోంది. దీనికితోడు పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళితే ప్రభుత్వం నుంచి నేరుగా రైతు ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం సాగుకు పెట్టుబడి అవసరం కానున్నందున సొమ్ము వెంటనే జమ చేయాలని కర్షకులు కోరుతున్నారు. 

కౌలు రైతుకు ఎంత కష్టం: కృష్ణా పశ్చిమ డెల్టాలో సింహభాగం భూములను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. తొలి పంట కింద వరి, రబీ సీˆజన్‌లో జొన్న, మొక్కజొన్న, అపరాలు సాగుచేస్తారు. తొలి పంట బాగా దిగుబడి వస్తే పెట్టుబడులు, కౌలు సొమ్ము చెల్లించడానికి సరిపోతుంది. రెండో పంట ద్వారా వచ్చే ఆదాయమే కౌలు రైతులకు మిగులుతుంది. దీంతో కౌలు రైతులు రెండో పంటలో వచ్చే సొమ్ముతోనే మళ్లీ ఖరీఫ్‌ సీˆజన్‌కు సిద్ధమవుతారు. తొలి వంట వరి కోత దశలో వచ్చిన తుపానుల వల్ల సర్వం కోల్పోయారు. పనల మీద ధాన్యం తడిసిపోవడంతో మొలకలు వచ్చి నష్టం వాటిల్లింది. తడిసిన పనలను ఆరబెట్టి నూర్పిడి చేయడానికి కూడా వచ్చిన సొమ్ము సరిపోలేదు. ఇంత కష్టపడి ధాన్యం ఇంటికి తెస్తే నాణ్యత లేక ధరలోనూ వ్యాపారులు కోత విధించారు. దీంతో వరి పంట మొత్తం గతేడాది నష్టాలు మిగిల్చింది. 

ఈసారి రెండో పంట అయిన జొన్న, మొక్కజొన్నకు బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఈక్రమంలో హమాలీ కూలీలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో రైతులు క్వింటాకు రూ.100కుపైగా విక్రయించే సమయంలో చెల్లించాల్సి వచ్చింది. ఈ సొమ్మును కూడా అప్పు తెచ్చి అప్పట్లో చెల్లించారు. రెండు నెలలైనా సొమ్ములు జమకాకపోవడంతో ఒకవైపు తెచ్చిన అప్పులు, మరోవైపు ఖరీఫ్‌ పెట్టుబడులకు చేతిలో సొమ్ము లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

జూన్‌ తొలి వారంలో విక్రయించా
జూన్‌ తొలి వారంలో 43 క్వింటాళ్లు జొన్నలు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. ఇప్పటివరకు నగదు జమకాలేదు. ప్రభుత్వం సకాలంలో సొమ్ము ఇస్తే అక్కరకు వస్తుంది. ఖరీఫ్‌ సీˆజన్‌ పనులు ప్రారంభమైనందున వెంటనే సొమ్ము జమ చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. 
- కె.తాతాజీ, చంపాడు గ్రామం, వేమూరు మండలం
వారం రోజుల్లో జమ చేస్తాం
జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్నకు సంబంధించి సొమ్ము చెల్లించాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ద్వారా లేఖ రాశాం. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమకావడం మొదలవుతుంది. వారం రోజుల్లో రైతులందరికీ ఖాతాలకు సొమ్ము జమ చేస్తాం. 
- శ్రీనివాసరావు, జిల్లా మేనేజరు, మార్క్‌ఫెడ్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని