సచివాలయ సిబ్బందిపై జేసీ ఆగ్రహం
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

సచివాలయ సిబ్బందిపై జేసీ ఆగ్రహం


బలిజేపల్లిలో సందర్శకుల పుస్తకంలో సిబ్బంది లోపాలను నమోదు చేస్తున్న జేసీ రాజకుమారి

రాజుపాలెం, న్యూస్‌టుడే: అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ..అంతర్జాలం వినియోగంలో అయోమయంగా వ్యవహరిస్తున్న సచివాలయ సిబ్బందిపై జిల్లా సచివాలయ జేసీ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుపాలెం మండలం బలిజేపల్లి సచివాలయాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. జిల్లాలో 1334 సచివాలయాలుండగా నిర్వహణలో అథమ స్థానంలో ఉన్న మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. అందరినీ సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. గ్రామ, వార్డు సచివాలయ పోర్టల్‌ను కంప్యూటర్‌లో ప్రారంభించలేకపోవడం, అపరిశుభ్రంగా ఉన్న కార్యాలయం, రెండేళ్ల నుంచి నిర్వహించాల్సిన తొమ్మిది రకాల రికార్డులను అరలో నుంచి బయటకు తీయకపోవడంపై విస్తుపోయారు. సచివాలయాల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షించకుండా ఏం చేస్తున్నారని ఎంపీడీవో తలుపుల శ్రీనివాసరావుపై మండిపడ్డారు. నిర్ధేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని, నెల రోజుల్లోగా పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న మండల పరిషత్‌ పాఠశాల భవనాన్ని తొలగించాలని గ్రామస్థులు విన్నవించగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎంఈవో మల్లికార్జునశర్మను ఆదేశించారు. అనంతరం ఆకులగణపవరం-1, 2 సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యాలయంలో ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు, వాలంటీర్ల హాజరు శాతం, బయోమెట్రిక్‌ వినియోగం, వ్యాక్సినేషన్‌, దిశయాప్‌ల వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. ఎన్ని పనులున్నా ప్రతి రోజూ సాయంత్రం 3 నుంచి 5 వరకు సచివాలయాల్లో స్పందన గ్రీవెన్స్‌ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సచివాలయ వ్యవస్థను ప్రజలందరూ వినియోగించుకొనేలా అర్జీదారులకు నిర్ణీత గడువులోపే ధ్రువపత్రాలను అందజేయాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని