Published : 22/01/2021 03:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జేమ్స్‌ ఆదేశిస్తాడు.. సభ్యులు అమలు చేస్తారు

సిమ్‌స్వాప్‌, ఫిషింగ్‌ మెయిల్స్‌తో నేరాలు

ఐదుగురు అరెస్ట్‌.. పరారీలో కీలక సూత్రధారి, మరొకరు

ఈనాడు, హైదరాబాద్‌

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

ముంబయి కేంద్రంగా ‘గ్యాంగ్‌ ఆఫ్‌ మిరా రోడ్‌’ చేస్తున్న సైబర్‌ నేరాలను సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్‌ చేశారు. గురువారం సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ వి.సి.సజ్జనార్‌ వివరాలను వెల్లడించారు. నైజీరియాలో ఉండే జేమ్స్‌ ముంబయిలోని ‘గ్యాంగ్‌ ఆఫ్‌ మిరా రోడ్‌’లోని చంద్రకాంత్‌ సిద్ధాంత్‌ కాంబ్లే, జమీర్‌ అహ్మద్‌ మునీర్‌ సయ్యద్‌, షోహైబ్‌ షేక్‌, అదిల్‌ హసన్‌ అలీ సయ్యద్‌, జునాయిద్‌ అహ్మద్‌ షేక్‌, అశ్విన్‌ నారాయణ షెరాగర్‌లతో కలిసి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నాడు. జేమ్స్‌ దేశంలోని కంపెనీ/సంస్థల ఈ-మెయిల్స్‌ను హ్యాక్‌ చేసి ఆదాయపన్నుశాఖ పేరిట ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపుతాడు. అవి అసలైనవిగా భావించి కొందరు బ్యాంకు ఖాతా, రిజిస్టర్‌ మొబైల్‌ నెంబరు, చిరునామా తదితర వివరాలను పంచుకునేవారు. అలా సేకరించిన మొబైల్‌ నెంబర్లను జేమ్స్‌ ముంబయిలోని చంద్రకాంత్‌కు చేరవేస్తాడు. వాటి ఆధారంగా ఖాతాదారుల వివరాలు, వ్యక్తిగత సమాచారం సేకరించేవాడు. నకిలీ ఆధార్‌ కార్డులు, సంస్థల రబ్బరుస్టాంపులు తయారు చేయించేవాడు. జమీర్‌ అహ్మద్‌ మునీర్‌, జునాయిద్‌ అహ్మద్‌ షేక్‌లు నకిలీ వివరాలతో కొత్త సిమ్‌కార్డులు పొందేవారు. చంద్రకాంత్‌ చేతికి ఖాతా వివరాలు, కొత్త సిమ్‌కార్డులు (రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్లు) అందగానే వాటిని జేమ్స్‌కు చేరవేస్తాడు. ఇంటర్నెట్‌ అక్రమ లావాదేవీలో రూ.లక్షలు కొల్లగొట్టి ఆ సొమ్మును షోయబ్‌ షేక్‌, అశ్విన్‌ నారాయన్‌ పేరిట ఉన్న ఖాతాల్లోకి మళ్లించేవారు. ఆ ఇద్దరూ నగదు విత్‌డ్రా చేసి జేమ్స్‌కు హవాలా/బిట్‌కాయిన్‌ రూపంలో బదిలీ చేసేవారు. తిరిగి జేమ్స్‌ ముఠా సభ్యులకు కమీషన్‌ ఇచ్చేవాడు. 2011 నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాపై పలు ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ బృందం దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. జేమ్స్‌, మరో నిందితుడు షోయబ్‌ షేక్‌ పరారీలో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని