Published : 04/03/2021 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదోన్నతులు లేవు.. ప్రయోజనాలు రావు

ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో పదోన్నతులు లభించక సహాయ ఆచార్యులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత ప్రయోజనాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పదోన్నతికి నోచుకోకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్న పరిస్థితి. 17 ఏళ్ల తర్వాత 2007లో ఓయూలో 92 మంది సహాయ ఆచార్యులుగా నియమితులయ్యారు. వీరు, కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ కింద 12 ఏళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి పొందేందుకు అర్హత సాధిస్తారు. 2019 మే నుంచి పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగలేదు. అప్పట్లో ఉపకులపతి పదవీకాలం ముగిసే సమయంలో నోటిఫికేషన్‌ ఇచ్చినా అడుగు ముందుకు పడలేదు. 2019 జులై నుంచి ఇన్‌ఛార్జి వీసీ పాలన కొనసాగుతోంది. తర్వాతి అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రక్రియ ముందుకు కదల్లేదు.

నామినీలను నియమించినా..

ఇటీవల పదోన్నతుల ప్రక్రియకు ఇన్‌ఛార్జి వీసీ అర్వింద్‌కుమార్‌ పచ్చజెండా ఊపారు. ఇందుకుగాను ముఖాముఖీలు నిర్వహించాలి. వీసీ నామినీ ఉంటే సరిపోతుంది. సీనియర్‌ ఆచార్యుణ్ని ఇన్‌ఛార్జి వీసీ తన నామినీగా నియమించారు. కమిటీలో గవర్నర్‌ నామినీని సైతం ఏర్పాటు చేశారు. రిజిస్ట్రార్‌ నుంచి ఆమోదం రాక ప్రక్రియ ముందుకు సాగడంలేదు. త్వరలో వీసీల నియామకం చేపట్టే అవకాశం ఉందన్న ఉద్దేశంతో, కొత్త వీసీ వచ్చాక చేపడదామని పక్కకు పెట్టినట్లు సమాచారం.

జాప్యంతో నష్టం

8 మంది సహాయాచార్యులు ఇప్పటికే ఉద్యోగ విరమణ చేశారు. ప్రయోజనాలేవీ పొందలేకపోయామని వాపోయారు. ‘‘పదోన్నతుల విషయాన్ని మరోసారి ఇన్‌ఛార్జి వీసీ దృష్టికి తీసుకెళతాం. పదోన్నతులు ఎప్పుడొచ్చినా, అర్హత పొందిన తేదీ నుంచే ప్రయోజనాలు దక్కుతాయని’’ రిజిస్ట్రార్‌ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి తెలిపారు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని