
రేషన్ దుకాణాల్లో ఆధార్ అనుసంధానం
పౌరసరఫరాల శాఖ నిర్ణయం
న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్: రేషన్ సరకుల పంపిణీకి ప్రభుత్వం ఓటీపీ, ఐరిస్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆధార్‌తో చరవాణి నంబరు అనుసంధానం చేసుకోవాలని సూచించింది. మీ-సేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల వద్ద తెల్లవారు జామునుంచే బారు తీరుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి గమనించిన పౌరసరఫరాల శాఖ చౌక ధర దుకాణాల్లో ఓటీపీ, ఐరిస్ చేయించేలా చర్యలు చేపట్టింది. ఇకపై మీ-సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పనుంది. ఆధార్ లింక్‌కు డీలర్లకు రూ.50 చెల్లించాలని నిర్ణయించింది. అంతేకాకుండా అధికారులు మరిన్ని అంశాలపై స్పష్టతనిచ్చారు. కార్డులో నమోదైన కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరి నంబరుతోనైనా ఆధార్‌తో అనుసంధానం ఉంటే సరిపోతుందని అంటున్నారు. ఆ ప్రకారమే బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు 130 మంది డీలర్లు తమ పేర్లను జిల్లా పౌరసరఫరాల శాఖకు సమర్పించారు. ఇంటర్ ఉత్తీర్ణులై కంప్యూటర్‌పై అవగాహన ఉన్నవారిని ఎంపిక చేశారు. వీరిని ఒక రోజు శిక్షణకు త్వరలో పంపించేందుకు సిద్ధం అవుతున్నారు.
అధికారుల సూచన మేరకు ఏర్పాట్లు
రాజేశ్వర్, డీసీఎస్
అధికారుల సూచన మేరకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి కార్డుదారునికి బియ్యం పంపిణీ చేసేలా చూస్తున్నాం. ఆధార్ నంబరుతో చరవాణి అనుసంధానం లేని వారికి ఐరిస్ ద్వారా బియ్యం పంపిణీ చేశాం. కొవిడ్ కారణంగా బయోమెట్రిక్ విధానం అంత సులభం కాదని భావించిన ప్రభుత్వం ఆధార్‌కు చరవాణి నంబరును అనుసంధానం చేసే చర్యలు చేపట్టింది.