
బాలింతల బే‘జారే’
తాండూరు టౌన్ (న్యూస్టుడే): తాండూరు జిల్లా ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. మూడంతస్తుల్లో 200 పడకలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా దవాఖానాలో సరైన సౌకర్యాలు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పై అంతస్తుకు వెళ్లేందుకు, కిందకు వచ్చేందుకు లిఫ్ట్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాలతో పాటు కొడంగల్, పరిగి నియోజకవర్గాల ప్రజలు, పొరుగు జిల్లాలు మహబూబ్నగర్, సంగారెడ్డి, సరిహద్దు కర్ణాటక నుంచి నిత్యం ఇక్కడికి వస్తున్నారు. పై అంతస్తులోనే శస్త్ర చికిత్సలు, డయాలసిస్ కేంద్రం, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఇతర వార్డులున్నాయి. కాన్పు అయిన వారు, కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారు ర్యాంపు ద్వారా కిందకు దిగాల్సి వస్తోంది. గర్భిణులు, బాలింతల అవస్థ చెప్పనలవి కాదు. వీరితోపాటు, అత్యవసర పరిస్థితుల్లో చేరే వారిది అదే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులే వీల్ ఛైర్లు, స్టెచ్చర్లు తోసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. లిఫ్ట్ ఏర్పాటుకు స్థలం కేటాయించి సమకూర్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.