Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశంలో దళితులపై పెరిగిన అకృత్యాలు

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర ఛైర్మన్‌ గజ్జల కాంతం, పిడమర్తి రవి, రాపోలు రాములు, దళిత, బహుజన నేతలు

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: దేశంలోని దళితులపై రోజురోజుకు పెరుగుతున్న అకృత్యాలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దళిత, బహుజన సంఘాల నేతలు మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధి కోసం అమాయక ప్రజల, జవాన్ల ప్రాణాలను ఆ పార్టీ బలి తీసుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, దాని విశిష్టతను ప్రజలకు తెలియజెప్పే లక్ష్యంతో ఈనెల 14న అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని నగరంలో ‘నీలి కవాతు’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌ గజ్జల కాంతం, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి, అంబేడ్కర్‌ సంఘాల సమాఖ్య రాష్ట్ర ఛైర్మన్‌ రాపోలు రాములు, టీపీఎస్‌ జేఏసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్ము తిరుపతి తదితర దళిత సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ‘నీలి చొక్కాలు - నీలి కవాతు’ గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం దళిత నేతలు మాట్లాడుతూ దేశంలో మళ్లీ వర్ణ వ్యవస్థను తీసుకువచ్చేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు తీవ్రంగా కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అదాని, అంబాని సంస్థలకు విక్రయించిన సంస్థలను మళ్లీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 14న బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌ వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు నీలి కవాతు కొనసాగుతుందని చెప్పారు. భీం ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సుజిత్‌ రావణ్‌, దళిత సంఘాల నేతలు శ్రీకృష్ణ, నర్సింగరావు, రమణ, మొగిలి, సురేష్‌, మహేష్‌, నరేష్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని