Published : 12/04/2021 06:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్నా.. బ్యాంకు నుంచిమాట్లాడుతున్నా..

యువతులతో ఫోన్లు చేయిస్తున్న సైబర్‌ నేరస్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘అన్నా.. నమస్తే... నేను ఫలానా బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నా.. మీకు డెబిట్‌కార్డుంది కదా.. దాంతో షాపింగ్‌ చేస్తే పదిశాతం క్యాష్‌బ్యాక్‌ సౌకర్యం ఇప్పిస్తున్నాం.. మా బ్యాంక్‌కే చెందిన క్రెడిట్‌కార్డు ఉంటే మీ లావాదేవీల ఆధారంగా రుణపరిమితిని కూడా పెంచుతున్నాం... కొత్తగా మీరేం చేయాల్సిన పనిలేదు.. మీ కార్డు నంబరు చెబుతాం... చివరి అంకెలు, మేం పంపిన ఓటీపీ వివరాలు వెల్లడిస్తే చాలు... మీ వద్ద కార్డు సిద్ధంగా ఉంటే నేను అడిగిన వాటికి సైతం జవాబు చెప్పండి..’’
-అంతర్జాల సౌకర్యం ఉన్న డెబిట్‌ కార్డుదారులకు తెలంగాణ యాసలో, తెలుగుభాషలో యువతులు ఫోన్‌చేసి మాట్లాడుతున్నారు. ఇదంతా నగదు బదిలీ చేసుకునేందుకు సైబర్‌ నేరస్థుల మాయాజాలం.. ఆంగ్లం, హిందీలో మాట్లాడితే కొందరు స్పందించడం లేదని తెలుసుకున్న నేరస్థులు దిల్లీ, నోయిడాల్లో తెలుగుభాష తెలిసిన ట్యూటర్లతో తెలుగు భాష, తెలంగాణ యాసను యువతులకు నేర్పించి వారితో బాధితులకు ఫోన్‌  చేయిస్తున్నారు. రోజుకు రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

మనవారేనన్న భావన..
తెలంగాణ యాసలో మాట్లాడితే మనవారేనన్న భావన, భాషాభిమానంతో బాధితులు ఎక్కువ సేపు మాట్లాడతారన్న అంచనాతో సైబర్‌ నేరస్థులు స్థానికభాషలను తెరపైకి తీసుకువచ్చారు. దీంతోపాటు యువతులు మాట్లాడితే డెబిట్‌ కార్డుదారులు స్పందిస్తారన్న భావనతో వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.  ఇందుకోసం ఇంటర్‌, డిగ్రీ చదువుతోనే ఆపేసిన యువతులను ఎంపిక చేసుకుంటున్నారు. వారికి అంతర్జాల పరిజ్ఞానాన్నీ కొంత మేర నేర్పుతున్నారు. ఆనక యువతులకు ఎలా మాట్లాడాలో నేర్పించి భాషా ప్రావీణ్యంతో బ్యాంకుల ప్రతినిధులమంటూ చెబుతున్నారు. దిల్లీ, ముంబయిలలో కొన్ని ఏజెన్సీలు, పొరుగుసేవల కంపెనీలు, నేరగాళ్ల వద్ద నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకుఖాతాలున్న వారి వివరాలనూ తీసుకుని.. వారి డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల నంబర్లు చెబుతున్నారు.
పెట్టుబడి రూ.వేలల్లో... నగదు బదిలీ రూ.లక్షల్లో..
నాలుగు కంప్యూటర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఓ కాల్‌సెంటర్‌, వివిధ సిమ్‌కార్డులు.. ఇలా రూ.వేలల్లో పెట్టుబడి పెడుతున్న సైబర్‌ నేరస్థులు రూ.లక్షల్లో నగదు బదిలీ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు తమకు వచ్చిన ఫిర్యాదులను పోలీసులు పరిశీలించగా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఖాతాలు ఉన్న 30 మంది నుంచి నేరస్థులు రూ.32 లక్షలు నగదు బదిలీ చేసుకున్నట్లు తేలింది. సంబంధిత వ్యక్తులను ఎలాగైనా పట్టుకునేందుకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిందితులంతా దిల్లీ, నోయిడాల్లో కాల్‌సెంటర్‌ తరహాలో తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారని తెలుసుకున్నారు. వాటిల్లో యువతులను ఉద్యోగులుగా నియమించుకుని ఇదంతా చేస్తున్నారని ఇప్పటికే గుర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని