Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉమ్మినందుకు మందలిస్తే.. చితకబాదారు!

మలక్‌పేట ఠాణాలో ముగ్గురిపై కేసు

సైదాబాద్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద ఉమ్మినందుకు మందలించిన ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు చితకబాదారు. మలక్‌పేట ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో   గుర్తుతెలియని ముగ్గురిపై కేసును నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు వివరాల ప్రకారం.. పాతబస్తీ న్యూరక్షాపురం పరిధి రాజీవ్‌నగర్‌ ప్రాంత నివాసి ఆర్‌.దేవేందర్‌(26).. బల్దియాలో ఎస్‌ఎఫ్‌ఏగా పొరుగుసేవలపై కొనసాగుతున్న తండ్రి సుదర్శన్‌ను వ్యాక్సిన్‌ కోసం శాలివాహననగర్‌ యూపీహెచ్‌సీకి ఆదివారం ఉదయం తీసుకొచ్చాడు. టీకా తీసుకునేందుకు తండ్రి లోపలికి వెళ్లగా దేవేందర్‌ ఆసుపత్రి గేటు వద్ద ఉన్నాడు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. అందులో 70 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి గేటు వద్ద ఉమ్మాడు. కొవిడ్‌ సమయంలో ఉమ్మి వేయడం మంచిది కాదని మందలించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వృద్ధుడు, అతనితో వచ్చిన ఇద్దరూ తీవ్రంగా దూషిస్తూ చితకబాదారు. వారు వెళ్తూ యువకుడి తండ్రిని కూడా కాలితో తన్ని వెళ్లారు. ముఖంపై తీవ్ర రక్తస్రావం కావడంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ముగ్గురిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని