Published : 21/04/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊపిరి తీసిన రహదారులు

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకుల మృతి

చాదర్‌ఘాట్‌, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన సునీల్‌(25), ఆసిఫ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మారుతి(25) స్నేహితులు. సునిల్‌ బేగంబజార్‌లో ఓ దుకాణంలో పని చేస్తుండగా, మారుతి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కలిసి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై చాదర్‌ఘాట్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్తున్నారు. మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ ప్రధాన ద్వారం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మారుతి అక్కడికక్కడే చనిపోగా సునిల్‌ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వదిన అంత్యక్రియలకు వెళ్లి వస్తూ మరిది దుర్మరణం

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: అంత్యక్రియలకు వెళ్లి తిరిగొస్తూ డివైడర్‌ను ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. పటాన్‌చెరు ఠాణా ఎస్సై సాయిలు తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం జొంగులూరు గ్రామానికి చెందిన భిక్షపతి (45) పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఉంటున్నాడు. సోమవారం పుల్కల్‌ మండలం మంతూరులో ఉన్న అతని వదిన చనిపోతే అంత్యక్రియలకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగొస్తున్నాడు. రాత్రి 7.30 గంటల సమయంలో ఇస్నాపూర్‌ శివారు మహేశ్వర మెడికల్‌ కళాశాలకు వెళ్లే కూడలి జాతీయ రహదారిపై డివైడర్‌ను ద్విచక్ర వాహనంతో ఢీకొని రహదారిపై పడిపోయి అక్కడికక్కడే దుర్మణం పాలయ్యాడు. మృతుని భార్య శివలీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని యువకుడు..

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: కారు ఢీ కొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పేట్‌బషీరాబాద్‌ సీఐ ఎస్‌.రమేశ్‌ కథనం ప్రకారం.. మేడ్చల్‌ పరిధిలోని ఉమానగర్‌కు చెందిన కె.ప్రవీణ్‌రెడ్డి (36) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సుచిత్రా కూడలి నుంచి మేడ్చల్‌ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. కొంపల్లిలోని దూలపల్లి కూడలి వద్ద వెనకనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని మరో వ్యక్తి..

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గోపాలపురం ఎస్సై శ్రీను వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మణికాంత్‌(35) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశాడు. స్నేహితుడితో కలిసి యూసుఫ్‌గూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నగరంలో ఫుడ్‌కోర్ట్‌ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. మంగళవారం సాయంత్రం అతను మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్‌ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. రైలు నిలయం వద్దకు రాగానే యాదగిరిగుట్ట నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న యాదగిరిగుట్ట డిపో బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చరవాణి ఆధారంగా వివరాలను గుర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని