Corona: పాతబస్తీ.. కరోనాపై జబర్దస్తీ!
logo
Updated : 12/05/2021 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: పాతబస్తీ.. కరోనాపై జబర్దస్తీ!

పాజిటివ్‌ రేటు 2, 3 శాతానికే పరిమితం
ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, చంచల్‌గూడ

ఇళ్లవద్దకే వచ్చి పరీక్షలు చేస్తోన్న వైద్యసిబ్బంది

కరోనా మహమ్మారి రెండో దశ విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది మంది మహమ్మారి బారిన పడుతున్నారు.  హైదరాబాద్‌ సహా శివారుల్లో చాలావరకు ఆరోగ్య కేంద్రాల్లో పాజిటివ్‌ రేటు 40-50శాతం మధ్య ఉంటోంది.
కానీ పాతబస్తీ ప్రాంతం అందుకు మినహాయింపుగా చెప్పుకోవాలి. అక్కడి పీహెచ్‌సీలలో పాజిటివ్‌ రేటు పది శాతం లోపే..! నిత్యం పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తున్నా, వాటిల్లో 5శాతానికి అటూ.. ఇటూగా పాజిటివ్‌ రేటు నమోదవుతోంది. మలక్‌పేట, చార్మినార్‌ జోన్ల పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో చేసిన పరీక్షలను విశ్లేషిస్తే ఇదే సష్టమవుతోంది. పాతబస్తీలోని 18 ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేస్తున్నారు. ఉదాహరణకు దారుల్‌షిఫా పీహెచ్‌సీలో ఈ నెల 10న 50 మందికి పరీక్షలు చేస్తే ఒక్కరికే పాజిటివ్‌ వచ్చింది.
ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ.. కేవలం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ మాత్రమే కాదు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో సైతం పాజిటివ్‌ రేటు పెద్దగా కనిపించడం లేదు. ఈ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలుతున్న వారి సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంటోంది. దారుల్‌షిఫా, అజాంపుర, యాకుత్‌పుర పీహెచ్‌సీలలో నిర్వహించిన పరీక్షల్లో ఒక్క శాతమే 
పాజిటివ్‌ వచ్చింది. యాకుత్‌పుర-2 పీహెచ్‌సీ పరిధిలో పాజిటివ్‌ రేటు ఏకంగా సున్నాగా ఉంది. ఇక్కడ ఇప్పటివరకు 471 ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా ఒక్కరికి కూడా పాజిటివ్‌ రాలేదని వైద్యాధికారులు చెబుతున్నారు.

ఎందుకిలా..

* పాతబస్తీలోని ప్రాంతాలకు రాకపోకలు(వలసలు) తక్కువ. దీనివల్ల వైరస్‌ వ్యాప్తికి కట్టడి పడుతోంది.

* ప్రస్తుతం కరోనా రాకుండా లేదా కరోనా వచ్చాక కషాయం తాగాలని సూచిస్తున్నారు. దాల్చినచెక్క, లవంగాలు, అల్లం, యాలకులు వంటి వాటితో కషాయం కాస్తున్నారు. ఇది కరోనాకు విరుగుడుగా ప్రచారంలో ఉంది. వీటితోపాటు మరికొన్ని సుగంధ ద్రవ్యాలను వినియోగించి హలీం తయారు చేస్తుంటారు. ‘హలీం తినడం ద్వారా కషాయం తాగిన శక్తి సమకూరుతుందనడంలో సందేహం లేదు. దీనికితోడు మాంసాహారంలో ఉండే పోషకాలు అందుతాయి కనుక రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది’ అని చార్మినార్‌ ప్రాంతంలో ప్రభుత్వ వైద్యుడు ఒకరు విశ్లేషించారు.

* ఇక్కడి ప్రజలు డ్రైఫ్రూట్స్‌నూ అధికంగా తీసుకుంటున్నారు. ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర వహిస్తోంది.

* ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పారిశుద్ధ్య చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పత్తర్‌ఘట్టి, తలాబ్‌చంచలం, డబీర్‌పురా, రెయిన్‌బజార్‌ ప్రాంతాల్లో నిత్యం బ్లీచింగ్‌ చేయించడం లేదా సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయడం చేస్తున్నారు.

లక్షణాలు కనిపిస్తే మందులిస్తున్నాం

డాక్టర్‌ బ్రిజున్నీసా, డిప్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌, మలక్‌పేట

జలుబు, జ్వరం వంటివి రాగానే ప్రజలు ఆసుపత్రులకు వస్తున్నారు. అందరికీ అందుబాటులో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఏ చిన్న లక్షణం కనిపించినా మాత్రలు తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. పోషకాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నాం. కరోనా మొదటి దశ నుంచే అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నాం. దీనివల్ల పాజిటివ్‌ రేటు తక్కువగా ఉంటోందని అంచనా వేస్తున్నా.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని