ఇన్ని కేసులు, మరణాలు ఊహించలేదు: కిషన్‌రెడ్డి
logo
Published : 12/05/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇన్ని కేసులు, మరణాలు ఊహించలేదు: కిషన్‌రెడ్డి


మహిళల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గౌతంరావు తదితరులు

బౌద్ధనగర్‌, న్యూస్‌టుడే: రెండో దశలో దేశంలో భారీ ఎత్తున కరోనా కేసులు, మరణాలు నమోదవుతాయని ఊహించలేదని.. ప్రస్తుత పరిణామాలు బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల కారణంగా వైరస్‌ వ్యాప్తి చెందిందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన నాటికి దేశంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కాలేదని తెలిపారు. బౌద్ధనగర్‌ డివిజన్‌ వారాసిగూడలో భాజపా మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శానిటైజేషన్‌ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రభుత్వాలకు సహకరించి, కొవిడ్‌ కట్టడికి కృషి చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: మహిళా సాధికారతకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బర్కత్‌పురలోని నగర పార్టీ కార్యాలయంలో కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న మహిళల శిక్షణ తరగతులను జిల్లా భాజపా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు సొంతంగా అభివృద్ధి చెందేందుకు స్వయం ఉపాధి పథకాలు దోహదపడతాయని చెప్పారు. రెండు రోజుల క్రితం కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో తలెత్తిన ఆక్సిజన్‌ సమస్య నేపథ్యంలో మంగళవారం కిషన్‌రెడ్డి నగర పార్టీ కార్యాలయం నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బర్కత్‌పురలోని నగర పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో పాటు పలువురికి మందులు, మాస్కులు, శానిటైజర్‌ సీసాలు తదితర వస్తువులతో కూడిన కరోనా కిట్స్‌ అందచేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిట్టి శ్రీధర్‌, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.యశ్వంత్‌, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని