ఇదేం తీరు..!
eenadu telugu news
Published : 04/08/2021 01:25 IST

ఇదేం తీరు..!

రోడ్లు వేశారు.. కల్వర్టులు మరిచారు

రూ.18 కోట్ల నిధులున్నా పనులేవీ

పాత కల్వర్టుపైనే రోడ్డు వేసిన రోడ్ఢు..

కొడంగల్‌, న్యూస్‌టుడే: రోడ్డు విస్తరణ పనుల్లో నిబంధనలకు నీళ్లోదులుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో కల్వర్టు నిర్మాణం చేయకుండానే సీసీ రోడ్డు వేస్తున్నారు. దీంతో మళ్లీ భారీ వర్షాలు పడిన సమయంలో రహదారులు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. సర్కారు కోట్ల రూపాయలు వెచ్చించి పనులు నిర్వహిస్తున్నా.. అవి పక్కాగా జరగక పోవడం ఆందోళన కల్గిస్తుంది.

ఇదీ పరిస్థితి..

పెద్దనందిగామ బాపల్లి రోడ్డు విస్తరణకు రూ.18కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. అందులో 12.6కి.మీ దూరం వరకు బీటీ రోడ్డు ఉండగా కోస్గి రోడ్డు నుంచి వేంకటేశ్వరస్వామి జాతర స్థలం వరకు 800 మీటర్ల దూరం మాత్రం సీసీ రోడ్డు వేస్తున్నారు. అయితే సీసీ వేస్తున్న ప్రదేశంలో మొత్తం నాలుగు కల్వర్టులు వస్తున్నాయి. ఏళ్ల కిందట ఈ కల్వర్టుల నిర్మాణం చేశారు. అయితే ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో టీటీడీ కల్యాణ మండపానికి దగ్గరలో, కుమ్మరివాడ మలుపు వద్ద, బత్తుల సాయప్ప ఇంటి వద్ద ఉన్నది, పోచమ్మ గుడి దాటిన తరువాత ఒకటి ఉంది. ఆ నాలుగు ప్రదేశాల్లో వాస్తవానికి కొత్తగా నిర్మాణం చేసి ఎత్తు పెంచాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వర్షం నీరు కింద నుంచి ప్రవహించేందుకు అనుకూలంగా ఉంటుంది. కానీ అధికారులు అలా చేయడం లేదు. పాత నిర్మాణాలపైనే కొత్త రోడ్డు వేస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆ రోడ్లు మూడునాళ్ల ముచ్చటగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఒక వేళ సీసీ రోడ్డు వేసిన తర్వాత కల్వర్టుల కింద చెత్త నిండి నీరు వెళ్లక పోతే రోడ్డును ధ్వంసం చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. లేకుంటే సమీపంలోని నివాసాల్లోకి నీరు చేరుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అవసరం ఉన్నా..

కొడంగల్‌ నుంచి బాపల్లి వరకు చేస్తున్న బీటీ రోడ్డు పనుల్లో ఎన్ని కల్వర్టులు అవసరం అవుతాయో వాటిని నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అందుకు రూ.18 కోట్ల సర్కారు కేటాయించారు. కానీ అవసరం ఉన్న ప్రదేశంలో కూడా వాటి నిర్మాణం చేయకుండానే సీసీ రోడ్డు పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


బాగున్నందుకే చేయడం లేదు..

-శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఏఈ, కొడంగల్‌

సీసీ రోడ్డు వేస్తున్న ప్రదేశంలో ఉన్న కల్వర్టులు అన్ని బాగానే ఉన్నాయి. అందుకోసమే వాటిని తొలగించకుండానే వాటిపైనే రోడ్డు వేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కల్వర్టులో పేరుకొని పోయిన మట్టిని తొలగిస్తాం. అత్యవసరం ఉన్న ప్రదేశంలో మాత్రం కొంత వెడల్పు చేసి కల్వర్టు పొడవు పెంచడం జరుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని