రైతును మోసం చేసిన వీఆర్‌ఏపై వేటు
eenadu telugu news
Published : 04/08/2021 01:25 IST

రైతును మోసం చేసిన వీఆర్‌ఏపై వేటు

నవాబ్‌పేట: భూ రిజిస్ట్రేషన్‌ విషయంలో రైతును మోసం చేసిన వీఆర్‌ఏ మహేష్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేట మండల పరిధిలోని రైతు ఆలూరి పర్మయ్యకు 5.12 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి పాసుబుక్‌ ఇప్పిస్తామని, రైతు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, ఆయనకు తెలియకుండానే మొత్తం భూమిని ఇతరుల పేరుపై వీఆర్‌ఏ గతంలో రిజిస్ట్రేషన్‌ చేశారు. తమకు అన్యాయం జరిగిందని తెలుసుకున్న రైతు, గ్రామస్థుల సహకారంతో గతనెల 25 తహాసీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వడం, వెంటనే వీఆర్‌ఏకు తాఖీదులివ్వడం జరిగిపోయాయి. తరువాత జరిగిన పరిణామాలలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తితో గ్రామస్థులు, అధికారులు మాట్లాడారు. అతను 5.12 ఎకరాల భూమిని గత నెల 29న తిరిగి రైతు ఆలూరి పర్మయ్య పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ మొత్తం వ్యవహారానికి కారకుడు, రైతును మోసం చేసిన గంగ్యాడ గ్రామానికి చెందిన వీఆర్‌ఏ మహేష్‌పై శాఖా పరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తహసీల్దారు బుచ్చయ్య తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభించామని, భూ క్రయ విక్రయాల్లో ఏమైనా అనుమానాలుంటే తమను సంప్రదించాలని ఆయన కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని