Crime News: పెళ్లి చేసుకోమంటే..ప్రాణం తీశాడు!
eenadu telugu news
Updated : 04/08/2021 07:06 IST

Crime News: పెళ్లి చేసుకోమంటే..ప్రాణం తీశాడు!


దీపక్‌

అల్వాల్‌, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో బాలికను పథకం ప్రకారం ప్రియుడు హత్య చేసిన ఘటన అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓల్డ్‌ అల్వాల్‌ పరిధిలో నివసించే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేయగా, రెండో కూతురు(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల సమయంలో భూదేవి నగర్‌కు చెందిన దీపక్‌(20)తో ప్రేమ ఏర్పడింది. కొన్ని నెలలుగా బాలిక పెళ్లి ప్రస్తావన తెస్తుండటంతో ఆమె ఫోను నంబరు బ్లాక్‌ చేశాడు. అతడితో మాట్లాడాలని సోమవారం ఉదయం స్నేహితుల ద్వారా తాము తరచూ కలుసుకునే బీహెచ్‌ఈఎల్‌ కాలనీ సమీపంలోని ప్రాంతానికి రావాలని సూచించింది. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటుండగా పెళ్లి ప్రస్తావన రావడంతో ఘర్షణ పడ్డారు. అప్పటికే ఆమెను వదిలించుకోవాలని ఉన్న దీపక్‌.. చున్నీతో బాలికకు ఉరి వేసి పరారయ్యాడు. కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు నిందితుడిని సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్వచ్ఛ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాత్రి అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని