ఆగ ‘మేఘం’.. ఆగమాగం
eenadu telugu news
Updated : 03/09/2021 07:56 IST

ఆగ ‘మేఘం’.. ఆగమాగం

కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

హానగర వీధుల్ని మరోసారి వరద ముంచెత్తింది. గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా కురిసిన జోరువానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 7గంటల నుంచి చిరుజల్లులుగా మొదలై 15నిమిషాల్లోనే దాదాపు 3.5సెంటీమీటర్ల వాన నగరవ్యాప్తంగా కురిసింది. ముందస్తు హెచ్చరికలతో బల్దియా, ట్రాఫిక్‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, షేక్‌పేట, నాంపల్లి, లక్డీకాపూల్‌ ప్రాంతాల్లో విరిగిపడ్డ చెట్లను బల్దియా సిబ్బంది తొలగించారు. నగరం నైరుతి వైపున ఉరుములతో వాన బీభత్సం సృష్టించింది.

* యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, ఖాజాగూడ, బోరబండ, రహమత్‌నగర్‌ బస్తీల్లో భారీగా వరద నీరు ప్రవహించింది. మోకాళ్లలోతు వరదలో రోడ్లపై నిలిపిన ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. షేక్‌పేట ఆదిత్యనగర్‌, కృష్ణానగర్‌, యూసుఫ్‌గూడ పరిధిలో రోడ్ల పక్కనున్న కిరాణా దుకాణాల్లోకి, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు ఇబ్బందులుపడ్డారు.

* సోమాజీగూడ, బీఎస్‌ మక్తాల్లో వానకు తోడు ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద పోటెత్తడంతో రోడ్లన్నీ నీట మునిగాయి. రాజ్‌భవన్‌ రహదారి, మక్తా రైల్వే గేటు, ఖైరతాబాద్‌ రైల్వే గేటు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రగతిభవన్‌, బేగంపేట ప్రాంతాల్లోనూ ప్రధాన రహదారులపై వరద నీటితో ట్రాఫిక్‌ నిలిచింది.


వాగులను తలపించిన శ్రీకృష్ణానగర్‌ వీధులు

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: లోతట్టు ప్రాంతమైన శ్రీకృష్ణానగర్‌లోని వీధులు వాగును తలపించాయి. కమ్యూనిటీహాల్‌ వీధిలో నడుములోతు వరదనీరు ప్రవహించింది. ఇక్కడి సింధూ టిఫిన్‌ సెంటర్‌, ఏ-బ్లాకులోని నాలా రోడ్డులో వరద ధాటికి చెత్త రిక్షా, ఓ ద్విచక్ర వాహనం కొట్టుకుపోయాయి. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానికులు కాపాడారు. శ్రీకృష్ణానగర్‌ ఏ-బ్లాకు నుంచి లక్ష్మీనరసింహనగర్‌కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.


విద్యుత్తు కంట్రోల్‌ రూంల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థపై దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి అత్యవసరంగా ఆడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందుబాటులో ఉన్న సీజీఎం, ఎస్‌ఈలతో పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా వినియోగదారులు 1912/100/స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ ఆఫీసుతో పాటు విద్యుత్తు కంట్రోల్‌రూంల నంబర్లు 7382072104/106/1574కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని సీఎండీ సూచించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని