‘ప్రగతి రథచక్రం’.. ప్రమాద రహితం
eenadu telugu news
Published : 17/09/2021 00:34 IST

‘ప్రగతి రథచక్రం’.. ప్రమాద రహితం

 ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యం 

మేటిగా నిలిచిన పరిగి డిపో
న్యూస్‌టుడే, పరిగి

ఉత్తమ డ్రైవర్లతో అధికారులు

ప్రస్తుత పరిస్థితుల్లో డ్రైవింగ్‌ చేయడమే అంటే ఒక కళ. నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం అంటే గొప్పే. అందుకే దేశంలోనే ఆర్టీసీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందులోనూ అతి తక్కువ ప్రమాదాలతో తెలంగాణకు మరో గుర్తింపు ఉంది. దైనందిన జీవితంలో ప్రతి మనిషి అనేక రకాల సమస్యలతో సతమతమవడం సర్వసాధారణం. ఎన్ని సమస్యలు వెంటాడుతున్నా స్టీరింగ్‌ పట్టుకుంటే చాలు అవన్నీ పక్కకు పెట్టి ఏకాగ్రతే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందుతున్నారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి డిపోలు ఉండగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రమాద రహిత డిపోగా పరిగి మేటిగా నిలిచింది.

ప్రతిజ్ఞ చేస్తున్న ఉద్యోగులు

ప్రత్యేక శిక్షణ: ప్రతి డిపోలో డ్రైవర్లు నడుపుతున్న తీరును పరిశీలించడం, అవసరమైన వారికి తర్ఫీదు ఇవ్వడం, సురక్షితమైన విధానాలపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను అందించేందుకు సేఫ్టీ డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లు పనిచేస్తున్నారు. దీంతో చాలా వరకు పనితీరు మెరుగు పడేందుకు ఇది దోహదపడుతోంది. ప్రమాద రహిత డ్రైవర్లకు ఆర్టీసీ అధికారులు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. పదేళ్లలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటే ఏటా సుమారు రూ.800 వరకు అదనంగా పొందుతున్నారు. మూడు డిపోల పరిధిలో దాదాపు 70శాతం మంది డ్రైవర్లు ప్రోత్సాహకాలను అందుకుంటుండగా మిగతా వారు కూడా పోటీ పడుతున్నారు. తాండూరు, వికారాబాద్‌ డిపోల్లో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పరిగి ప్రమాదరహితంగా ప్రథమస్థానంలో నిలిచింది. దీంతో అధికారులు ఏడుగురు వాహన చోదకులను ఇటీవల  సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు.

నిత్యం ప్రమాణం: ఏ రోజూ ప్రమాదం చేయనని ఉద్యోగులు నిత్యం ప్రతిన బూనుతున్నారు. డ్రైవర్లతో పాటు కండక్టర్ల పాత్ర కూడా ప్రమాదాల నివారణలో ఎంతో కీలకంగా మారింది. దీంతో అన్ని డిపోల్లోనూ అధికారులు దీనిని అమలు చేస్తున్నారు. ఇది వారి క్రమశిక్షణకు పునాదిగా మారిందని అధికారులు చెబుతున్నారు. సంస్థ పరిరక్షణ బాధ్యత ఉద్యోగులపైనే ఉందని అంకితభావంతో పనిచేయాలని సూచిస్తున్నారు.

ఉత్తమ డ్రైవర్లకు ప్రోత్సాహకాలు

-రమేష్‌, డివిజనల్‌ మేనేజర్‌, వికారాబాద్‌
మూడు డిపోల్లో పరిగి ప్రమాదరహితంగా ఎంపిక కావడం హర్షణీయం. ఉద్యోగుల అంకితభావమే ఇందుకు నిదర్శనం. ఉత్తమంగా పనిచేస్తున్న డ్రైవర్లకు ప్రతిఏటా ప్రోత్సాహకాలను అందిస్తూ సన్మానిస్తున్నాం. దీంతో వాహన చోదకుల మధ్య పోటీ పెరుగుతోంది. ఇదే సంస్థ అభివృద్ధికి బాటలు వేస్తోంది. కొవిడ్‌ సమయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయడం అభినందనీయం. రోడ్లపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రమాదం జరగని రోజంటూ లేదు. అయినా డ్రైవర్లు ఏకాగ్రతతో పనిచేయడం, సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో సమస్యలను అధిగమిస్తున్నాం. ఇదే స్ఫూర్తి అన్ని డిపోల్లోనూ రావాలని ప్రయత్నిస్తున్నాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని