Crime News: హైదరాబాద్‌లో నేపాలీ ‘కైలాలీ’ దొంగలు.. వీరి రూటే వేరు
eenadu telugu news
Updated : 21/09/2021 06:55 IST

Crime News: హైదరాబాద్‌లో నేపాలీ ‘కైలాలీ’ దొంగలు.. వీరి రూటే వేరు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంట్లో పని మనుషులుగా కుదురుతారు. నమ్మకంగా వ్యవహరిస్తారు. ఇంట్లో ఏయే వస్తువులు, ఎక్కడెక్కడుంటాయో తెలుసుకుంటారు. ఆ తర్వాత అదును చూసి ఆహారంలో మత్తు మందు కలిపేస్తారు. లేదంటే.. కుటుంబ సభ్యులంతా బయటికెళ్లినప్పుడు ఇంట్లో అందిన కాడికి అందుకుని చెక్కేస్తారు. ఈ తరహాలో నేపాల్‌కు చెందిన ‘కైలాలీ’ దొంగల ముఠా కొంత కాలంగా నగరంలో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా రాయదుర్గం ఠాణా పరిధిలోని టెలికాంనగర్‌లోని ఓ ఇంట్లో 120 తులాల బంగారం, రూ.15 లక్షల నగదును దోచుకెళ్లింది కూడా ఈ ముఠా సభ్యులేనని ప్రాథమికంగా నిర్ధారించారు.
మెట్రో నగరాలు.. ఖరీదైన ఇళ్లు
హైదరాబాద్‌ సహా మెట్రో నగరాల్లోని ఖరీదైన ఇళ్లను ఎంపిక చేసుకుని ‘కైలాలీ ముఠా’ సభ్యులు పనికి కుదురుతారు. శుభ్రం చేసే సమయంలో దొరికిన డబ్బులు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను యజమానులకు తిరిగిచ్చేసి నమ్మకం పొందుతారు. ఇతర ముఠా సభ్యులను బంధువులుగా పరిచయం చేస్తారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలున్నాయి, డబ్బులు, ఇతర ఆభరణాలను ఎక్కడ దాస్తున్నారు, పారిపోవడానికి అనువైన మార్గం తదితరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత అదను చూసి చేతికి పని చెప్తారు. ఈ తరహాలోనే కోకాపేట్‌లోని అరిస్టాస్‌ పాలోమీ గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లా నంబర్‌ 44లో రూ.2 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. కుషాయిగూడ ఠాణా పరిధి సైనిక్‌పురిలోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో రూ.2కోట్లు విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, నగదును దొంగిలించారు. గతంలో రాయదుర్గం, నాచారం, ముసారాంబాగ్‌లోనూ చేతివాటంచూపించారు.


స్వదేశానికెళ్తే ఏం చేయలేరంతే...

ముఠా సభ్యులు పక్కా ప్రణాళికతో చోరీలకు పాల్పడతారు. ఒక్కోచోరీలో అయిదుగురు నుంచి పదిమంది వరకు పాల్గొంటారు. ఫోన్లను అక్కడే పారేస్తారు. సీసీటీవీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్‌ (డిజిటల్‌ వీడియో రికార్డర్‌)ను కూడా వెంట తీసుకెళ్తారు. పోలీసులకు చిక్కకుండా విడివిడిగా రోడ్డు మార్గంలో నాందేడ్‌.. పుణె/ఇండోర్‌, లఖ్‌నవూ మీదుగా నేపాల్‌కు చేరుకుంటారు.  ఒక్కసారి నేపాల్‌కు చేరుకున్నారంటే ఇక అంతే. మనకు, ఆ దేశానికి ఖైదీల అప్పగింతకు సంబంధించిన ప్రత్యేక ఒప్పందం అమల్లో లేకపోవడం వరంగా మారింది. సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు  అక్కడ మకాం వేసి  నిందితులను గుర్తించినా  ఇక్కడికి తీసుకురాలేకపోయారు. స్వాధీనం చేసుకున్న సొత్తును కూడా స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనే డిపాజిట్‌ చేసి వచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని