అంగన్‌వాడీ కేంద్రాలకు ఆరోగ్య కిట్లు
eenadu telugu news
Published : 24/09/2021 00:45 IST

అంగన్‌వాడీ కేంద్రాలకు ఆరోగ్య కిట్లు

మెడికల్‌ కిట్‌లోని సామగ్రి

న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం (బొంరాస్‌పేట): పూర్వప్రాథమిక విద్యలో భాగంగా మూడు నుంచి ఐదేళ్ల వయసు చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉంటున్నారు. ఆటా పాటల్లో నిమగ్నమయ్యే పిల్లలు ఆడుకుంటున్న సమయాల్లో జారిపడుతుంటారు. ఇలా తరుచూ గాయపడటం, జలుబుతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీరికి ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన వైద్య కిట్లను అధికారులు కేంద్రాలకు సరఫరా చేశారు. చిన్నారులకు పూర్వప్రాథమిక విద్యతో పాటుగా గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి అవగాహన కల్పిస్తూ పోషక ఆహారం అందిస్తున్నారు. పుట్టిన పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. నేటికీ గ్రామాల్లో పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేకంగా ఆహారం అందిస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల్లో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,106 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 8,794 మంది గర్భిణులు, 6,533 మంది బాలింతలకు సేవలు అందిస్తున్నారు. మూడు నుంచి ఐదేళ్ల చిన్నారులు 27,494 మంది కేంద్రాల పరిధిలో ఉన్నారు.

కేంద్రాల్లో ఆడుకుంటున్న సమయంలో చిన్నపాటి గాయాలైనప్పుడు వెంటనే ప్రథమ చికిత్స అందించేందుకు వీలుంటుంది. కిట్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. కిట్టులో ఐదు రకాల ఔషధాలతో పాటుగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటుగా ప్రథమ చికిత్సకు ఉపయోగించే సామగ్రి ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన వాటితోపాటు మరి కొన్ని ముఖ్యమైన ఔషధాలు ఇస్తే బాగుండేదని ఉపాధ్యాయినులు పేర్కొంటున్నారు.

అవగాహన కల్పించాం

విజయలక్ష్మి, సీడీపీఓ, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు, కొడంగల్‌

కేంద్రాలకు వస్తున్న చిన్నారులు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ప్రభుత్వం మెడికల్‌ కిట్లను అందిస్తున్నారు. ఉపాధ్యాయులకు కిట్ల వినియోగంపై ప్రాజెక్టు స్థాయిలో క్లష్టర్ల వారీగా అవగాహన కల్పించాం. తక్షణమే ప్రథమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో అందుకు అవసరమయ్యే మందులతో కూడినవి అందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని