నిర్ధారణ కాకుండా.. నలిపేస్తోంది
eenadu telugu news
Updated : 24/09/2021 10:52 IST

నిర్ధారణ కాకుండా.. నలిపేస్తోంది

ఏ విషయం తేలక వైరల్‌ జ్వరాలకే చికిత్స

ఈ లోపు పడిపోతున్న ప్లేట్‌లెట్లు

మహానగరాన్ని వణికిస్తున్న డెంగీ

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి;

ఈనాడు, హైదరాబాద్‌

* అత్తాపూర్‌కు చెందిన మోక్షిత్‌రెడ్డి(8 నెలలు)కి పది రోజుల కిందట తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకోవడంతో మూడోరోజు ఇంటికి తీసుకెళ్లారు. వారం రోజులకు మళ్లీ 103 డిగ్రీల జ్వరం రావడంతో అదే ఆస్పత్రిని ఆశ్రయించారు. డెంగీ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా, గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది. శరీరం నల్లబారింది. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి పేరొందిన చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. అక్కడ డెంగీ నిర్ధారణ కావడంతో చికిత్స ప్రారంభించారు. క్రమేపీ కోలుకుంటున్నాడు.

* ఇటీవల తీవ్ర జ్వరంతో ఉన్న మూడేళ్ల చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్లేట్‌లెట్లు 10 వేలకు పడిపోయి, పరిస్థితి విషమించి చేర్పించిన ఒక్క రోజులోనే చనిపోయాడు. వారం రోజులుగా అతనికి పలు పరీక్షలు చేయించారు. డెంగీ నెగెటివ్‌ వచ్చిందని వైరల్‌ జ్వరానికి మందులు వాడారు. డెంగీ వెలుగుచూడక పరిస్థితి చేయిదాటి మరణించాడు.

నెల రోజుల క్రితం వరకు గత ఏడాదితో పోలిస్తే రాజధానిలో డెంగీ కేసులు తక్కువగానే ఉన్నాయి. ఒక్కసారిగా వేలాదిగా వెలుగుచూస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో ఇప్పటికే 800 వరకు కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి రానివి మరెన్నో ఉన్నాయి. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో చేరిన నలుగురు పిల్లలు కన్నుమూశారు. అందరూ చివరి నిమిషంలో చేరిన వారే.


తొలుత ఎన్‌ఎస్‌-1 యాంటీజెన్‌ తరవాత ఐజీఎం, ఐజీజీ

ఇది ర్యాపిడ్‌ టెస్టు. తక్కువ ఖర్చుతో కూడుకుంది. వెంటనే ఫలితం వస్తుంది. డెంగీ లక్షణాలుండీ ఇందులో నెగెటివ్‌ వస్తే లేనట్లు భావించరాదు. అప్పటికే జ్వరం వచ్చి వారం రోజులు గడవటం వల్ల డెంగీ నెగెటివ్‌ వస్తుందని, పూర్తిస్థాయి నిర్ధారణకు ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల పరీక్ష చేయించుకోవాలి. ఎలీసా విధానంలో చేసే ఈ పరీక్షలో పాజిటివ్‌ వస్తే డెంగీ ఉన్నట్లే. ఇవి ఖరీదైన పరీక్షలు కావడంతో చాలా ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంల్లో ర్యాపిడ్‌ టెస్టుతో సరిపెడుతున్నారు. ఈ నిర్లక్ష్యమే రోగులపాలిట శాపమవుతోంది. పెద్దాసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితికి దారితీస్తోంది. చేరిన వెంటనే జ్వరం, లక్షణాలు, పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు వైద్యుల దృష్టికి తీసుకెళితే వెంటనే చికిత్స అందించటానికి వీలుంటుంది.


ఇదీ పరిస్థితి

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు డెంగీ లక్షణాలతో రోజుకు 2 వేల మందికిపైగా వస్తున్నారు. చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ తదితర ఆస్పత్రుల్లో వందల మంది చికిత్స పొందుతున్నారు.


ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

ఇంటిని, ఆవరణను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలు లేకుండా చూడాలి. వాడుక నీటిని రోజుమార్చి రోజు మార్చాలి.


ఆందోళన వద్దు.. అప్రమత్తత అవసరం

- డాక్టర్‌ శివరాజ్‌, సీనియర్‌ ఫిజీషియన్‌

* ఈ సీజన్‌లో జ్వరం వస్తే డెంగీ లేదంటే మలేరియాగా అనుమానించాలి. ఆందోళన పడకుండా వెంటనే అప్రమత్తం కావాలి. డెంగీని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది.

* డెంగీలో తీవ్ర జ్వరం, తలనొప్పి, కంటిగుడ్డు వెనుక నొప్పి, కళ్లు కదిలించలేని పరిస్థితి, ఎముకలు మెలిపెట్టినట్లు నొప్పి తదితర లక్షణాలుంటాయి. నాలుగైదు రోజుల తర్వాత తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. కోలుకుంటున్న దశలో ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. రక్తపోటు తగ్గి షాక్‌ సిండ్రోమ్‌ దశకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. నిరంతర పర్యవేక్షణ అవసరం. ప్లేట్‌లెట్లు 60-70 వేలకు తగ్గగానే ఎక్కించే ప్రయత్నం చేయరాదు. అది ఇతర సమస్యలకు దారితీస్తుంది.

* వైరల్‌ జ్వరాల్లో తలనొప్పి, ఒళ్లు నొప్పులు తదితర డెంగీ తరహా లక్షణాలు కన్పిస్తాయి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ సాధారణ చికిత్స పొందాలి. మూడు రోజుల తర్వాత లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో జాగ్రత్త అవసరం.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని