పెళ్లి తీరు మారుతోంది
eenadu telugu news
Published : 26/09/2021 06:10 IST

పెళ్లి తీరు మారుతోంది

 వివాహ వేడుకల్లో విభిన్న వాతావరణం

ఆన్‌లైన్‌ వేదికల నుంచి క్రమంగా బయటకు

* అత్తాపూర్‌కు చెందిన సైనికోద్యోగి కుమారుడు కెనడాలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌ యువతితో కుమారుడి పెళ్లి చేయాలని నిర్ణయించి ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. రెండో దశ కొవిడ్‌ విజృంభించడంతో కెనడా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఆ జంట హైదరాబాద్‌ రావడం సాధ్యపడలేదు. రాబోయే ముహూర్తాలలో ఇక్కడకు పిలిపించడమా! అక్కడే వివాహం జరిపించి ఆన్‌లైన్‌లోనే అక్షింతలు వేయించడమా! అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.

* కూకట్‌పల్లికి చెందిన వ్యాపారి ఒక్కగానొక్క కుమారుడి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు. కొవిడ్‌ కారణంగా రెండుసార్లు వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడినా ఏదో మూలన భయం.  సెప్టెంబరు 8న రాజస్థాన్‌లోని ఖరీదైన హోటల్‌లో 100 మంది బంధువుల మధ్య పెళ్లి జరిపించారని పురోహితులు బలరాం తెలిపారు. 25 ఏళ్ల తన అనుభవంలో డబ్బు విలువ గుర్తించి.. వివాహం జరిపిస్తుండటం ఇప్పుడే చూస్తున్నానంటూ వివరించారు.

 

ఈనాడు, హైదరాబాద్‌

పెళ్లంటే.. ఇరువైపుల బంధుగణం.. ఆకాశమంత పందిళ్లు.. అట్టహాసంగా ఏర్పాట్లు. ఇవన్నీ ఒకప్పటి మాట.. కొవిడ్‌ కల్లోలం తరువాత తమ ఇంట జరిగే సంబరం ఆత్మీయులకు ప్రమాదకారి కాకూడదనే విచక్షణతో ఆలోచిస్తున్నారు. బంధువుల ఇంట జరిగే వేడుకలకు ఆహ్వానం రాకున్నా పట్టించుకోవడంలేదని జగద్గిరిగుట్ట వాసి బసవరాజు తెలిపారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, గృహప్రవేశం, వివాహ వేడుకల్లో ఎంతో మార్పు వచ్చింది. ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ అతికొద్దిమంది దగ్గరి బంధువుల సమక్షంలో వివాహం జరిపిస్తున్నారు.  ప్రస్తుత సమయంలోనే పెళ్లి బాధ్యత తీర్చుకుంటే తక్కువ ఖర్చులో బయటపడతామనే ఆలోచన చాలామంది తల్లిదండ్రుల్లో గమనించానని వేదపండితులు యనమదల రాజేశ్‌శర్మ వివరించారు. పెళ్లి కుదుర్చుకున్న కుటుంబాల్లో మున్ముందు ఎలా ఉంటుందనే ఆందోళన మరో కారణమన్నారు.

మార్పును ఆహ్వానించి

కరోనా ఎంతకాలం ఉంటుందో తెలియదు. అప్పటికే పిల్లల పెళ్లి కుదిరిన కుటుంబాలు.. పెరిగిన ఖర్చులు.. భవిష్యత్‌పై అమోమయంతో ఆన్‌లైన్‌ వివాహాలకు మొగ్గుచూపుతున్నారు. దేశ, విదేశాల్లోని బంధువులు, స్నేహితులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ‘సికింద్రాబాద్‌లోని ఓ మార్వాడీ కుటుంబానికి అట్టహాసంగా పెళ్లి చేయగల స్తోమత ఉన్నా కేవలం 50 మంది మధ్య ముగించారు. సాంకేతికతో అందరూ ఒకేచోట ఉన్నామనే భావన సంతోషాన్ని మరింత పెంచిందంటారు ట్రినెట్‌ డిజిటల్‌ నిర్వాహకుడు సాయి వెంకట్‌. మొదట్లో కాస్త ఇబ్బందిపడినా క్రమంగా ప్రజలు కొవిడ్‌ వల్ల వచ్చిన మార్పును ఆహ్వానించారని వివరించారు. విదేశాల్లో ఇప్పటికీ కొవిడ్‌ ఆంక్షలు అమల్లో ఉండటంతో ఆన్‌లైన్‌ వేడుకలకే మొగ్గు చూపుతున్నారన్నారు.


అల్లంత దూరాన వేదికలు

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌.. వధూవరుల సొంతూళ్లకు దూరంగా కొద్దిమంది బంధువుల సమక్షంలో జరిపే వివాహ వేడుక. ఒకప్పుడు సంపన్న వర్గాలకే పరిమితమైనా ఇప్పుడు ఎగువ మధ్యతరగతి, వ్యాపార, ఉద్యోగవర్గాలు ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గోవా, ఉదయ్‌పూర్‌, జైపూర్‌, కేరళ, ఆగ్రా, ముస్సోరి అండమాన్‌, రిషికేష్‌ తదితర ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. చారిత్రక ప్రదేశాలు.. కొండలు..ఆహ్లాదకర వాతావరణంలో పరిమిత సంఖ్యలో ఖర్చు కలసివచ్చేలా వేడుకలు చేసుకొనేవారు పెరుగుతున్నట్లు ఈవెంట్‌ మేనేజర్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని