మృతులకు ఆసరా..అర్హులకు లేదు భరోసా!
eenadu telugu news
Updated : 27/09/2021 11:56 IST

మృతులకు ఆసరా..అర్హులకు లేదు భరోసా!

చనిపోయిన వారి ఖాతాలో పింఛన్లు
బతికి ఉన్నవారికి అందని వైనం
ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, బండ్లగూడ

ర్తను కోల్పోయి.. వృద్ధాప్య దశలో ఏ పనిచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్న అభాగ్యులు వారు.. అలాంటి వారికి ఆసరా అందక దీనస్థితిలో జీవిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే కాస్త సాయమూ నిబంధనలతో చేతికి రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆసరా పథకం కింద ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు పింఛనుదారులకు రూ.2,016.. దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పంపిణీ చేస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వేలాది మంది అర్హులున్నప్పటికీ నిబంధనల కారణంగా పింఛన్లు రాక అవస్థలు పడుతున్నారు. ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. వితంతువు లేదా వయసు పైబడినవారు అర్హులైనప్పటికీ పింఛన్లు అందడం లేదని తేలింది.

అడ్డంకిగా మారిన నిబంధన.. ప్రభుత్వ నిబంధన ప్రకారం కుటుంబంలో ఒక్కరికే పింఛను అందించే వీలుంది. కుటుంబంలో ఇద్దరూ వృద్ధాప్యంలో జీవిస్తున్నప్పటికీ పింఛను రావడం లేదు. ఆ తర్వాత భర్త లేదా భార్య చనిపోతే పింఛను రద్దు విషయంలో అంతులేని జాప్యం జరుగుతోంది. నెలలపాటు మృతుల ఖాతాల్లో జమ అవుతూనే ఉంది. భర్త చనిపోతే భార్య వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా.. అప్పటికే ఆ కుటుంబంలో మరొకరికి పింఛను ఇస్తున్నామన్న కారణంతో దరఖాస్తును అనుమతించడం లేదు. దీనివల్ల అర్హులైనప్పటికీ పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బ్యాంకు ఖాతాలో జమ అవుతున్న నగదును అందించాలని కోరుతున్నా.. పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో అన్ని కేటగిరీల్లో మొత్తం 4.68లక్షల మంది పింఛనుదారులున్నారు. ఇదే సమయంలో మూడు జిల్లాల్లో 64,600 మంది పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుని ఎదురుచూస్తున్నారు.


దారి మళ్లుతున్నాయా..?

గ్రేటర్‌తోపాటు శివారు పట్టణాల్లో ఆరేళ్లుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం పింఛన్లు జమ చేస్తోంది. కొందరికి ఏటీఎం కార్డులు ఉండగా.. మరికొందరికి లేవు. ఏటీఎం కార్డు ఉంటే వాటి సాయంతో నగదును చనిపోయిన లబ్ధిదారుల కుటుంబీకులకు తెలియకుండానే పింఛన్లు డ్రా చేసేసుకుంటున్నారు. 2016లో లబ్ధిదారుల క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. అప్పట్నుంచి తిరిగి పరిశీలన చేయలేదు. దీనివల్ల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎవరు ఉన్నారో.. లేరో అంతుచిక్కకుండా మారిందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండగా వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. రెండేళ్ల కిత్రం చార్మినార్‌ మండలంలో రూ.40లక్షల పింఛన్ల సొమ్ము పక్కదారి పట్టించిన వ్యవహారం కలకలం రేపింది. లబ్ధిదారులు మృతి చెందితే వెంటనే వారి పేర్లు తొలగించి.. కుటుంబంలో మరొకరికి ఆసరా పథకం వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. మృతి చెందిన లబ్ధిదారులను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విభాగంతో పింఛను పథకం అమలు చేస్తున్న విభాగాన్ని అనుసంధానిస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.●


* నాగోలు డివిజన్‌ ఫత్తుల్లాగూడకు చెందిన కాటేపాక సుక్కయ్య 2018 ఫిబ్రవరి 18న చనిపోయాడు. నాటి నుంచి ప్రతి నెలా పింఛను అతడి పేరుతో ఖాతాలో జమ అవుతోంది. ఇప్పటివరకు రూ.70,416 పింఛను వేసినట్లు అంచనా. ఈ పింఛను మొత్తం ఎవరు తీసుకుంటున్నారో అంతుచిక్కని పరిస్థితి. సుక్కయ్య భార్య తనకు పింఛను కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కుటుంబంలో ఒక్కరికే పింఛను అన్న నిబంధనతో.. అప్పటికే చనిపోయిన భర్తకు పింఛను వస్తోందని చెబుతూ ఆమెకు ఇవ్వకుండా నిలిపివేశారు.●


* ఇదే డివిజన్‌ త్యాగరాయనగర్‌ కాలనీకి చెందిన వీరభద్రయ్య 2019 నవంబర్‌ 7న మృతి చెందాడు. ఆయనకు అప్పటివరకు దివ్యాంగుల కోటాలో నెలకు రూ.3,016 వచ్చేవి. ఆ లెక్కన చూసుకుంటే ఖాతాలో రూ.69,368 జమ అవ్వాలి. తన భర్త చనిపోయాడని, పింఛను తనకు ఇవ్వాలని వీరభద్రయ్య భార్య అధికారులకు మొరపెట్టుకుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవన్న సాకుతో నెలల తరబడిగా అధికారులు పింఛను మార్చే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఆ కుటుంబానికి పింఛను వస్తున్నట్లు కాగితాల్లో ఉన్నా, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదు.●


* బండ్లగూడ గ్రామవాసి మెట్టు పోచయ్య గతేడాది జులై 11న చనిపోయాడు. ఆయన పింఛనుదీ ఇదే పరిస్థితి. గత నెల సైతం బ్యాంకు ఖాతాలో పింఛను జమ అయింది. నెలనెలా పింఛను వస్తోందని భావించినా రూ.30,240 ఖాతాల్లో పడ్డాయి. ఇదే సమయంలో పోచయ్య భార్యకు పింఛను రాక ఇబ్బందులు పడుతోంది. ఆమె పేరిట దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేకుండా మారింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని