సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

సంక్షిప్త వార్తలు

మద్యం మత్తులో గొంతు కోసి..!

వివాహేతర బంధమే కారణం

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: వివాహేతర బంధం కారణంగా ఇద్దరు మిత్రుల మధ్య మనస్పర్థలు హత్యాయత్నానికి దారి తీసిన ఘటన ఇది. ఘట్‌కేసర్‌ సీఐ చంద్రబాబు కథనం ప్రకారం.. జవహర్‌నగర్‌ అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన యువకుడు(30), కుషాయిగూడ చక్రిపురంలో నివాసముంటున్న మిత్రుడి సోదరితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు మిత్రులు మద్యం తాగారు. తర్వాత అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మిత్రుడిని యంనంపేట-ఘనాపూర్‌ మార్గానికి తీసుకొచ్చాడు చక్రిపురం యువకుడు. సోదరితో బంధాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించారు. ఆ మార్గంలో వెళుతున్నవారు నిలదీయడంతో పరారయ్యారు. స్థానికుల సాయంతో పోలీసులు ‘గాంధీ’కి తరలించారు. తనపై స్నేహితుడు, మరో వ్యక్తి దాడి చేశారని బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


సూడాన్‌ సైనికుడి చూపుడు వేలిని అతికించారు

ఖైరతాబాద్‌: తెగిపోయిన చూపుడు వేలిని నగర వైద్యులు శస్త్రచికిత్స చేసి అతికించినట్లు ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. సూడాన్‌లో జరిగిన కాల్పుల్లో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. చూపుడు వేలు తెగిపోయింది. తొలుత ఈజిప్టులోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయింది. సెప్టెంబరు 27న లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రిని ఆశ్రయించారు. అర్థోపెడిక్‌ సర్జన్‌ డా.వెంకటరమణ నేతృత్వంలో శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు పెన్ను పట్టుకుని సొంతంగా రాయగలుగుతున్నాడనిపేర్కొన్నారు.


16వ అంతస్తు నుంచి పడి టెకీ మృతి

నార్సింగి, న్యూస్‌టుడే: పదహారో అంతస్తు బాల్కనీలో నిల్చున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటన పీబీఈఎల్‌ సిటీలో చోటు చేసుకుంది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. జార్జిప్రదీప్‌ జోసెఫ్‌(48) గండిపేట మండలం పీరంచెరువు పరిధి పీబీఈఎల్‌ సిటీ ఎఫ్‌ టవర్‌లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నారు. గచ్చిబౌలిలోని హిటాచీ కార్యాలయంలో ఐటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి భార్య నీళ్లు తాగేందుకు వంట గదిలోకి వెళుతూ.. భర్త బాల్కనీలో నిల్చుని ఉండటం చూసింది. ఆమె అక్కడికి వెళుతుండగానే జోసెఫ్‌ బాల్కనీ లోనుంచి కిందపడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌, పోలీసులకు ఫోన్‌చేసి తెలిపింది. వారు అక్కడికి చేరుకునేసరికే జోసెఫ్‌ మృతిచెందాడు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


 బాలికను గర్భవతి చేసిన కేసులో.. సవతి తండ్రికి జీవిత ఖైదు 

కంచన్‌బాగ్‌, న్యూస్‌టుడే: సవతి తండ్రి లైంగికదాడితో గర్భం దాల్ఛి. బిడ్డకు జన్మనిచ్చిన బాలికకు సంబంధించిన కేసులో గురువారం మొదటి అదనపు ఎంఎస్‌జే నాంపల్లి కోర్టు న్యాయమూర్తి బి.సురేష్‌ తీర్పు వెలువరించారు. మార్చిలో ఈ దారుణం చోటుచేసుకుంది. డీఎస్పీ, ఇన్‌ఛార్జి ఠాణా ఇన్‌స్పెక్టర్‌ జూలకంటి వెంకటరెడ్డి వివరాల ప్రకారం.. హాఫిజ్‌బాబానగర్‌లో నివసిస్తున్న బాలిక(17)పై సవతి తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతడికి బాలిక తల్లి సహకరించింది. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సవతి తండ్రి, తల్లిని అరెస్టు చేసి చంచల్‌గూడకు తరలించారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.26వేల జరిమానా విధించారు. బాలిక తల్లిని నిర్దోషిగా ప్రకటించారు.


మరో ఆరు ప్రాంతాల్లో దోమల యంత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: దోమలను బంధించే యంత్రాలను జీహెచ్‌ఎంసీ మరో ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. వీటిలో చిక్కిన వాటిలో ఆడ, మగ దోమలు ఎన్ని ఉన్నాయి? ఏ వ్యాధులకు అవి కారణమవుతున్నాయో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. రూ.60వేల విలువైన ఒక్కో మస్కీట్‌ పరికరం చుట్టూ 400 మీటర్ల మేర సంచరించే దోమలను ఆకర్షిస్తుందని వివరించారు. అవి లోపలికి వచ్చే క్రమంలో సెన్సార్లు దోమ జాతి, ఇతర వివరాలను నమోదు చేస్తాయని, వాటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఈ పరికరాల పనితీరు పరిశీలించామని, ఫలితాలు బాగుండటంతో జోన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేసినట్లు దోమల నియంత్రణ విభాగం వెల్లడించింది.


పెళ్లి దాటవేస్తున్నాడని ప్రేమికురాలి ఆత్మహత్య

శామీర్‌పేట, న్యూస్‌టుడే: ప్రేమికుడు పెళ్లిని దాటవేస్తున్నాడని మనోవేదనతో ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం శామీర్‌పేటలో చోటు చేసుకుంది. శామీర్‌పేట ఎస్సై రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేటకు చెందిన యువతి(34) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఒక అక్క ముగ్గురు చెల్లెళ్లు. తల్లిదండ్రులు చనిపోయారు. అక్కా, ఒక చెల్లి పెళ్లి అయ్యింది. అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావని మిగతా వారు యువతిని అడగగా.. తాను అల్వాల్‌కు చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. మరో మూణ్నెళ్లలో చేసుకుంటామని ఆమె చెప్పింది. సమయం దగ్గర పడుతుందని పెళ్లి చేసుకుందామని ప్రేమికుడితో ఆమె చెప్పగా ప్రేమికుడు దాటవేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని