Published : 21/04/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మానేరులో గోదావరి పరవళ్లు

వేసవిలో ఇదే మొదటిసారి

మత్తడి దూకుతున్న ఎగువమానేరు జలాశయం

గంభీరావుపేట, న్యూస్‌టుడే: కేవలం వర్షాలపై ఆధారపడి నిండే ఎగువమానేరు జలాశయం నేడు మండు వేసవిలోనూ మత్తడి దూకుతోంది. కొండపోచమ్మ ద్వారా ఎగువమానేరును పూర్తిస్థాయిలో నింపారు. ప్రాజెక్టు చరిత్రలో వేసవి కాలంలో పరవళ్లు తొక్కడం ఇదే మొదటిసారి. ఎండా కాలంలో డ్రై స్టోరీజి ఉండే జలాశయం నేడు నిండుకుండను తలపిస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎగువమానేరు జలాశయాన్ని 1945-51 సంవత్సరంలో ఆఖరి నవాబు నిర్మించారు. దాదాపు రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఇది 13 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తుంది. పూడిక తీయకపోవటం కేవలం ఒక టీఎంసీ సామర్థ్యం మాత్రమే ఉంది. దీంతో దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాలకు సాగు నీరు అందుతుంది. వర్షాకాలంలో ప్రాజెక్టు నిండటానికి కూడవెళ్లి వాగు, పాల్వంచ వాగు ద్వారా వచ్చిన వరద నీటితో నిండేది. గతంలో కూడవెళ్లి వాగు ద్వారా భారీ వరద వచ్చేది. అయితే దానిపై దాదాపు 20 పైన చెక్‌ డ్యాంలు నిర్మించటంతో ఎగువమానేరు నిండటం ఆలస్యమయ్యేది. వర్షాధారమే కాకుండ శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు పలుసార్లు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఓవైపు మధ్యమానేరు నుంచి ఎగువమానేరు నింపడానికి తొమ్మిద ప్యాకేజి పనులు వేగవంతంగా నడుస్తున్న దానినే ఆధారం చేసుకోకుండా కొండపోచమ్మ నుంచి కూడవెళ్లి వాగు ద్వారా ఎగువమానేరును నింపారు. తొమ్మిదో ప్యాకేజి పనుల్లో జాప్యం జరిగితే కొండపోచమ్మ ద్వారా మానేరు నింపుతామని గతంలో ఇచ్చిన హామీని మంత్రి కేటీఆర్‌ నెరవేర్చుకున్నారు. ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు భూగర్భ జలాలు పెరగటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మానేరు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బావులు పూర్తిగా నిండి జళకలను సంతరించుకున్నాయి.

మంత్రి కేటీఆర్‌ కృషితోనే...

- వంగ కరుణ, ఎంపీపీ

మంత్రి కేటీఆర్‌ కృషితోనే ఎగువమానేరుకు శాశ్వత జలకళ వచ్చింది. గతంలో చాలా సార్లు చాలా మంది ప్రజాప్రతినిధులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని శాశ్వత జలకళ కోసం కృషి చేశారు. ఈ ప్రాంతవాసులు సంతోష పడుతున్నారు. రైతుల కల నేడు నెరవేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని