మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు


సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

జ్యోతినగర్‌-గోదావరిఖని, న్యూస్‌టుడే : మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పోక్సో కేసుల్లోని నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా అన్నిరకాల ఆధారాలను న్యాయస్థానాలకు సమర్పించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీపీసీ టీటీఎస్‌లోని ఉద్యోగ వికాస కేంద్రంలో గురువారం నిర్వహించిన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారుల నేర సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పోలీసుస్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని తెలిపారు. పెండింగ్‌లో కేసుల సత్వర పరిష్కారంతోనే బాధితులకు న్యాయం జరుగుతుందని, వెంటనే కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సైబర్‌ నేరగాళ్లు అమాయక ప్రజల నగదును దోచుకోవటానికి యత్నిస్తున్నారని, సైబర్‌ నేరాలపై అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్‌ నేరాల బారిన పడి నగదును కోల్పోయిన బాధితులు ఆలస్యం చేయకుండా టోల్‌ నంబరు 155260, డయల్‌ 100, 112కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌, బీట్స్‌ ద్వారా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు అధికారులంతా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని తెలిపారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలని, పెండింగ్‌ చలాన్లను కట్టించాలని ఆదేశించారు. పోలీసుస్టేషన్ల పరిధిలోని అన్ని ప్రదేశాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ ‘నేను సైతం’ కార్యక్రమం నిర్వహించాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకొని సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఓఎస్‌డీ శరత్‌చంద్రపవర్‌, డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌, ఏసీపీలు అఖిల్‌మహాజన్‌, రహెమాన్‌, నరేందర్‌, సారంగపాణి, నారాయణ, రమణబాబు, సుందర్‌రావు, మల్లికార్జున్‌, ఏవో నాగమణి, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని