పైపుల కొనుగోలు పేరిట దోపిడీ
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

పైపుల కొనుగోలు పేరిట దోపిడీ

దొంగల ముఠా అరెస్ట్‌ను వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రకాశ్‌

వెల్గటూరు, న్యూస్‌టుడే : బోర్‌వెల్‌ పైపులను కమీషన్‌ ప్రాతిపదికన సరఫరా చేస్తూ జీవనోపాధి పొందుతున్న నలుగురు వ్యక్తులు పైపులను కొనుగోలు చేసినట్లు నటించి రూ.3.16 లక్షల విలువైన పైపులను దారి దోపిడీ చేసినట్లు జగిత్యాల సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి ఆర్‌.ప్రకాశ్‌ వెల్లడించారు. నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సోమవారం వెల్గటూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వివరాలు ఇలా.. మంచిర్యాలలోని ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన వారణాసి ఉమామహేశ్‌(23), సుందరయ్య కాలనీకి చెందిన పర్వతం విజయ్‌కుమార్‌(25), వేంపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన కుంచెం నవీన్‌(23), ప్రస్తుతం మంచిర్యాలలో ఉంటున్న నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన ఆలకుంట అజయ్‌కుమార్‌ అలియాస్‌ అజిత్‌(23) అనే నలుగురు బోర్‌వెల్‌ వేసుకునే వారికి కమీషన్‌ ప్రాతిపదికన పైపులు సరఫరా చేస్తుంటారు. పైపుల కోసం మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కంపెనీకి నాలుగైదు సార్లు ఆర్డర్‌ ఇచ్చి తెప్పించుకున్నారు. ఒకేసారి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో నిందితులు ఓ పథకం రూపొందించుకున్నారు. నకిలీ చిరునామాతో తీసుకున్న ఫోన్‌ నంబర్‌తో రాజా బోర్‌వెల్‌ ధర్మపురి పేరిట కంపెనీకి ఫోన్‌ చేశారు. తమకు బోర్‌వెల్‌కు ఉపయోగించే రూ.3,16,500 విలువైన 95 పీవీసీ పైపులు కావాలని ఆర్డర్‌ ఇచ్చారు. ఈ నెల 6న వ్యాన్‌లో పైపులు తీసుకొచ్చానని, రాయపట్నం వద్ద ఉన్నానని వ్యాన్‌ డ్రైవర్‌ రామ్‌బోజ్నే ఆ వ్యక్తులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. పథకం ప్రకారం వ్యానును దారి మళ్లించి వెల్గటూరు మండలం అంబారిపేట శివారు వద్దకు తీసుకొచ్చారు. డ్రైవర్‌కు రూ.3.52 లక్షలు ఇచ్చినట్లు నటించారు. విషయాన్ని డ్రైవర్‌ ద్వారా సదరు కంపెనీకి సమాచారం అందించేలా చేశారు. అనంతరం కమీషన్‌ ఇవ్వాలని డ్రైవర్‌ను మాటల్లోకి దింపి, నోట్లో గుడ్డలు కుక్కి, కళ్లకు గంతలు కట్టి సెల్‌ఫోన్‌తో పాటు తాము ఇచ్చిన నగదు లాక్కున్నారు. వ్యానులోని పైపులను మంచిర్యాలలోని బైపాస్‌ రోడ్డులోని నిందితులకు సంబËంధించిన ఇంటిలో దించుకున్నారు. ఎక్కడైనా చెబితే చంపుతామని డ్రైవర్‌ను బెదిరింపులకు గురి చేశారు. డ్రైవర్‌ ఫోన్‌, కళ్లకు కట్టిన గుడ్డలు, జీపీఎస్‌ను రాయపట్నం గోదావరి నదిలో పడేసి వెళ్లారు. వ్యాన్‌ డ్రైవర్‌ రామ్‌బోజ్నే ఈ నెల 11న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరిపారు. ధర్మపురి సీఐ కోటేశ్వర్‌ ఆధ్వర్యంలో ఎస్సై శంకర్‌నాయక్‌, కానిస్టేబుళ్లు పి.శ్రీను, వి.అభిషేక్‌ దర్యాప్తు చేపట్టారు. వెల్గటూరు, జగిత్యాల మార్గాల్లోని సీసీ పుటేజీల ఆధారంగా ముఠాను గుర్తించారు. సోమవారం నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ ప్రకాశ్‌ తెలిపారు. దోపిడికి ఉపయోగించిన కారు, ద్విచక్రవాహనం, 95 పీవీసీ పైపులు, 4 మొబైల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ బి.కోటేశ్వర్‌, ఎస్సై శంకర్‌నాయక్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విచారణలో కీలక పాత్ర పోషించిన వారిని ఎస్పీ సింధుశర్మ అభినందించినట్లు ఆయన తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని