ఏకగ్రీవ పంచాయతీలకు  నజరానా లేనట్లేనా?
eenadu telugu news
Updated : 27/10/2021 06:42 IST

ఏకగ్రీవ పంచాయతీలకు  నజరానా లేనట్లేనా?

న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం

తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ పంచాయతీ కార్యాలయం

కగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ప్రకటించడంతో పార్టీలు, నాయకులు విభేదాలను పక్కన పెట్టారు. 2019 జనవరిలో జరిగిన పల్లెపోరులో జిల్లాలో చాలా పంచాయతీలు పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. 2013లో రూ.7 లక్షలు మాత్రమే ప్రోత్సాహకంగా ఇవ్వగా ఈసారి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ మరో రూ.10 లక్షలు అదనంగా ఇస్తానని హామీనిచ్చారు. దీంతో మూడేళ్లు అయినా ప్రోత్సాహక నిధులు రాలేదు. పైగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేము ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ఇస్తామని చెప్పలేదనడంతో ఆయా పంచాయతీల సర్పంచులు అయోమయంలో పడ్డారు. నిధులు వస్తే గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాయని భావించిన వారిని నిరాశ తప్పలేదు. గ్రామ ప్రథమ పౌరులు నిధుల గురించి ఉన్నతాధికారులను అడిగితే వస్తాయని చెబుతుండటమే తప్ప రావడం లేదు.

మూడేళ్లుగా...
జిల్లాలో 2019లో జరిగిన పంచాయతీ పోరులో చాలా చోట్ల సర్పంచులు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో అనవసర ఖర్చు నివారణతోపాటు ఏకగ్రీవంతో వచ్చే నిధుల ద్వారా పంచాయతీలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో గ్రామస్థులందరు ఏకమై ముందుకొచ్చారు. జిల్లాలో 12 మండలాల్లో 255 పంచాయతీలు ఉండగా అందులో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 41 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులను విడతల వారీగా జనాభా ప్రాతిపదికన పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వాటిని సర్పంచులు వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం తదితర వాటికి  వెచ్చిస్తున్నారు. కానీ ఏకగ్రీవ పంచాయతీలకు మూడేళ్లు కావస్తున్నా నేటికీ ప్రోత్సాహక మొత్తం రాలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులు వస్తే...
ఏకగ్రీవ పంచాయతీలకు వెంటనే నిధులను మంజూరు చేస్తే గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాయని నజరానా కోసం మూడేళ్లుగా సర్పంచులు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించుకుంటామని సర్పంచులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని