లావైపోయారు
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

లావైపోయారు

వ్యాధుల బారిన జనం

వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు

మైదానం బాట పడితే మేలు

న్యూస్‌టుడే-కర్నూలు క్రీడలు (బి.క్యాంపు) : దసరా నేపథ్యంలో ఇంటిల్లిపాది వస్త్రాల కొనుగోలుకు దుకాణానికి వెళ్లారు. కొత్త వస్త్రాలు పట్టకపోవడంతో అవాక్కయ్యారు. శరీరాకృతిలో మార్పుల కారణంగా సైజు రెండింతలు పెరిగినట్లు గుర్తించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంట్లో ఎక్కువసేపు గడపడం.. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గమనించారు. ఆరోగ్య సమస్యలు అధిగమించేందుకు వ్యాయామం తప్పనిసరి అని భావించారు.

నడకతోనే కరుగుతాయి..

వృద్ధుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కనీసం అర్ధగంటపాటు నడక సారించాలి. యుక్త వయస్సు ఉన్నవారు కనీసం ఐదు కిలోమీటర్ల వరకు నడక అవసరమవుతుంది. పది వేల అడుగులు వేస్తే 500 క్యాలరీల వరకు బయటకు వెళ్తాయి. చక్కెర వ్యాధి, బీపీ, శరీరంలో కొవ్వు శాతం అదుపులో ఉంటుంది. లేకుంటే కొవ్వు రూపంలో పేరుకుపోయే ప్రమాదముంది. శరీరానికి తగిన శ్రమ లేకపోతే ఊబకాయం వంటి సమస్యలతోపాటు టైప్‌-2 మధుమేహం, క్యాన్సర్‌ వ్యాధులబారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

క్రీడా మైదానాలకే ప్రాధాన్యం

నడక సాగించేవారు తప్పనిసరిగా క్రీడా మైదానాలకు ప్రాధాన్యమివ్వాలి. మట్టి రోడ్డుపై నడిస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. వాకర్స్‌కు అవసరమైన క్రీడా మైదానాలు అందుబాటులో లేకపోవడంతో చాలామంది కాలనీల్లోని సీసీ రోడ్లపై నడుస్తున్నారు. ఈ మార్గాలపై నడిస్తే తక్కువ సమయంలోనే మోకాళ్లు అరిగిపోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా బూట్లు ధరించాలి. పాదానికి మధ్యలో స్ప్రింగ్‌ మూమెంటు అవసరం.

వ్యాయామం ఎంత అవసరమంటే..

కరోనాకు ముందు జనం మైదానాల్లో పెద్దఎత్తున ఉదయపు నడక చేసేవారు. జిమ్‌లకు వెళ్లేవారు. కరోనా నేపథ్యంలో చాలామంది వీటికి దూరమయ్యారు. ఆరోగ్యకర వ్యక్తికి 2,600 నుంచి 2,800 (పురుషులు), మహిళలకు 2,200 నుంచి 2,400 క్యాలరీలు అవసరమవుతాయి. వ్యాయామం లేకపోవడంతోపాటు చాలామంది ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.. అందుకు తగ్గట్టు కష్టం చేయకపోవడంతో శరీరాకృతిలో మార్పు వచ్చింది. అవసరానికి మించి 3 నుంచి 4 వేల క్యాలరీలు ఒంట్లోకి చేరుకున్నాయి. మరోవైపు పండగల నేపథ్యంలో తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో చాలామందిలో చక్కెర వ్యాధి సాధారణ స్థాయికన్నా రెండింతలు పెరిగిపోయింది. శరీరంలో కొవ్వు శాతం పెరిగి ఆరోగ్యానికి ముప్పు ఏర్పడిందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు.

ఇలా చేస్తే..

ప్రతిఒక్కరూ వ్యాయామం చేస్తే శరీరంలో పేరుకుపోయిన క్యాలరీలు కరిగించుకోవడం సులభం. కూర్చొని పనులు చేసేవారు మధ్యమధ్యలో లేచి నిలబడటం.. నడవడం వంటివి చేయాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు కుర్చీలో నుంచే కాలు, చేతులు కదపడం వంటి తేలికపాటి వ్యాయామం తప్పనిసరి. వృద్ధులు ఒకరిపై ఆధారపడకుండా తగినంత వ్యాయామం చేయాలి. అప్పుడు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

తినుబండారాలతోనే..

నగరవాసులు చైనీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌, సమోసా, బర్ఫీ, హల్వా కేసరి, ఐస్‌క్రీం, బర్గర్‌, పిజ్జా వంటి తినుబండరాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇవి తీసుకోవడంతో ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది.

బద్ధకం వీడాల్సిందే

- డాక్టర్‌ శ్రీధర్‌శర్మ, ప్రభుత్వ వైద్యుడు

కరోనా ఒకటి, రెండు దశల కారణంగా చాలామంది వివిధ రోగాలబారిన పడ్డారు. ఇందులో అధిక భాగం మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి బారిన పడ్డారు. కొవిడ్‌ కారణంగా చాలామంది వ్యాయామానికి దూరమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు వచ్చినా చాలామంది పెద్దగా స్పందించడం లేదు. బద్ధకం వీడి వ్యాయామం చేస్తే ఆరోగ్యవంతులుగా మారుతారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని