ఆరోగ్య ఉప కేంద్రానికి తాళం
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

ఆరోగ్య ఉప కేంద్రానికి తాళం

టెంట్ల నిర్వాహకుల నిర్వాకం

ఇబ్బందులు పడ్డ సిబ్బంది, ఆశా కార్యకర్తలు

ఆరుబయట టీకాలు వేస్తున్న ఆశా కార్యకర్తలు

నిజాంపేట (రామాయంపేట): కంటి వెలుగు కార్యక్రమం అమలుకు సరఫరా చేసిన వస్తు సామగ్రి, భోజనాలకు బిల్లులు చెల్లించ లేదన్న సాగుతో టెంట్లు నిర్వాహకులు ఆరోగ్య ఉపకేంద్రానికి తాళం వేసిన ఘటన మండల కేంద్రం నిజాంపేటలో బుధవారం చోటు చేసుకుంది. దీంతో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఆరుబయటే విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రత్యక్షసాక్షులు, ఆస్పత్రికి టీకాలు వేయించుకునేందుకు వచ్చినవారు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తెలిపిన వివరాలు.. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన చిన్నపిల్లల తల్లులు టీకాలు వేయించుకునేందుకు ఆరోగ్య ఉపకేంద్రానికి రాగా తలుపులు మూసి ఉండగా సమీపంలో ఉన్న ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఆరుబయటే టీకాలు వేసి పంపించారు. తలుపులు ఎందుకు వేశారో అని ఆరా తీయగా.. రెండేళ్ల కిందట ఇక్కడ ఆరోగ్య ఉప కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమం కింద దాదాపు 17 రోజుల పాటు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమం నిర్వహణకు నిజాంపేటకు చెందిన లక్ష్మణ్‌ టెంటు ఏర్పాటు చేయగా వైద్య సిబ్బందికి టీ, కాఫీలను స్థానిక హోటల్‌ నిర్వాహకుడు శేఖర్‌ సరఫరా చేశారు. పాఠశాల మధ్యాహ్న భోజనం నిర్వాహకులు భోజనం సరఫరా చేసేందుకు ముందుకొచ్చారు. శిబిరం 17 రోజుల పాటు కొనసాగగా టెంట్లు, టీ, కాఫీలు, భోజనానికి సంబంధించిన బిల్లులు నేటికీ చెల్లించక లేదు. భోజనాలకు రూ.22,100, టెంటుకు రూ.7 వేలు, టీ, కాఫీలకు రూ.2800 చెల్లించాల్సి ఉండగా రెండేళ్లు గడచినా అతీగతీ లేకపోవడంతో వారు పలుమార్తు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వారు బుధవారం ఆరోగ్య ఉప కేంద్రానికి తాళం వేశారు. దీంతో చిన్నపిల్లలకు టీకాలు వేయించుకునేందుకు వచ్చిన తల్లులు ఇబ్బందులు పడగా కేంద్రం ఎదుట సిబ్బంది టీకాలు వేయించి పంపారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు తాళం వేసిన నిర్వాహకులకు నచ్చజెప్పి తాళం తీయించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావును వివరణ కోరగా ఎక్కడ పొరపాటు జరిగిందో విచారించి మూడు రోజుల్లో వారికి పైకం చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని