గమ్యం చేరాలంటే గగనమే!
eenadu telugu news
Updated : 05/08/2021 12:26 IST

గమ్యం చేరాలంటే గగనమే!

పల్లెలకు రాని ప్రగతిరథ చక్రాలు

గ్రామీణులకు నిత్యం తప్పని తిప్పలు

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట

ఆటోలో ప్రయాణం ఇలా..

పెద్దశంకరంపేటకు 45 కిలోమీటర్ల దూరాన ఉన్న జిల్లా కేంద్రం మెదక్‌ వెళ్లాలంటే మూడు బస్సులు ఉండేవి. రెండోసారి లాక్‌డౌన్‌ అనంతరం సర్వీసులను రద్దు చేశారు. దీంతో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. ఆర్టీసీ బస్సులు ఉన్నప్పుడు రేగోడ్‌ నుంచి నార్సింగ్‌ వరకు 20 గ్రామాల ప్రజలకు ప్రయోజనం ఉండేది. లాక్‌డౌన్‌ అనంతరం ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకుండా పోయింది. బొడ్మట్‌పల్లి మీదుగా వేరే మార్గంలో మెదక్‌ వెళ్లాలంటే రూ.20 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇలా పలు గ్రామాల సర్వీసులు అందుబాటులో లేక ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా రెండోదశ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గడంతో ఆర్టీసీ అద్దె బస్సులను నిలిపివేసింది. దీంతో పల్లెవెలుగు సర్వీసులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈక్రమంలో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రమాదకర పరిస్థితుల్లో గమ్యం చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో ఉన్న ఏకైక మెదక్‌ ఆర్టీసీ డిపో పరిధిలో మొత్తం 108 బస్సులు ఉన్నాయి. ఇందులో 67 అద్దెవి.. 41 సంస్థకు చెందినవి. జులై 30 వరకు అద్దె బస్సులు నడవకపోవడంతో 41 బస్సులను వివిధ మార్గాల్లో నడుపుతున్నారు. దీంతో పలు గ్రామాలకు వెళ్లే ఆర్డీనరీ సర్వీసులను నిలిపివేశారు. మొత్తం 18 రూట్లకు సంబంధించి 5 రూట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈనెల 1 నుంచి అద్దెవి ఏడు ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో 48 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒకట్రెండు డిపోకే పరిమితం కాగా మిగతావి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఈక్రమంలో విధిలేక గ్రామీణ ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి నానా అగచాట్లు పడుతున్నారు. కిక్కిరిసిన ఆటోలు, జీపుల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


విధిలేని పరిస్థితుల్లో వెళ్తున్నాం..

- శ్రీనివాస్‌గౌడ్‌, జూకల్‌

లాక్‌డౌన్‌ అనంతరం బస్సులు గ్రామాలకు రాకపోవడంతో అవస్థలు పడుతున్నాం. మా గ్రామం జూకల్‌ నుంచి మెదక్‌ వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో రెండు చోట్ల ఆటోలు మారి.. ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్లి రావాల్సి వస్తోంది. మెదక్‌ వెళ్లి రావాలంటే ప్రజలు వెనకడుగు వేస్తున్నారు.


త్వరలో పల్లెవెలుగు సర్వీసుల పునరుద్ధరణ

- ప్రణీత్‌, మేనేజర్‌, మెదక్‌ ఆర్టీసీ డిపో

తాజాగా ఎక్స్‌ప్రెస్‌ అద్దె బస్సులు తిప్పుతున్నాయం. వారంలో పల్లెవెలుగు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. రాగానే ముఖ్యమైన పల్లె ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని