వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్యా
eenadu telugu news
Published : 22/09/2021 02:16 IST

వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్యా

చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే సందడి

● నర్సాపూర్‌ పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలో ఉన్న సాయిబాబా మందిరంలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూ వేలం వేయగా పట్టణానికి చెందిన ఎల్లారెడ్డిగారి వెంకట్‌రెడ్డి రూ.1.57 లక్షలకు దక్కించుకున్నారు.

ప్రధాన రహదారిపై బారులు..

వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని పదకొండు రోజులు భక్తుల పూజలందుకున్న స్వామివారు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణంలో వైభవంగా గణనాథుడి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి లంబోదరుడికి వీడ్కోలు పలికారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలను స్థానిక రాందాస్‌ చౌరస్తా మీదుగా శివారులోని కొంటూరు చెరువుకు తరలించారు. యువత, చిన్నారులు నృత్యాలతో సందడి చేశారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, పురపాలిక ఛైర్మన్‌ చంద్రపాల్‌, జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి పాల్గొని వారితో కలిసి నృత్యాలు చేశారు. ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు.

2,081 వినాయక విగ్రహాలు..

జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,081 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించగా అన్ని చోట్ల నిమజ్జనం పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రతి మండపానికి జియో ట్యాగింగ్‌ చేసి ఎప్పటికప్పుడు ఏఎస్పీ కృష్ణమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు పర్యవేక్షించాయని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ కృష్ణమూర్తి, మెదక్‌ డీఎస్పీ సైదులు తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, మెదక్‌ అర్బన్‌, నర్సాపూర్‌ టౌన్‌, మెదక్‌ టౌన్‌

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని