Updated : 26/11/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు అన్నదాతల బలవన్మరణం

గద్దగూటి అశోక్‌, రైతు

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర మండలంలోని సూరేపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరేపల్లికి చెందిన సామ కాంతరెడ్డి(56) తనకు ఉన్న పదెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని ప్రభుత్వం ఆదేశం మేరకు నియంత్రిత విధానంలో వరి సన్న, దొడ్డు రకం సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు. వరదలో రెండు పది హెచ్‌పీ మోటార్లు నీటిలో మునిగి చెడిపోయాయి. వానాకాలంలో ఆశించిన మేర పంట దిగుబడి రాలేదు. వేయి బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని భావించగా కేవలం 450 బస్తాలు మాత్రమే వచ్చింది. దీంతో సాగు కోసం చేసిన అప్పు తీర్చలేకపోయారు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఏమి చేయాలో పాలుపోక మనస్తాపానికి గురయ్యారు. గ్రామ పెద్దలతో తనకు జరిగిన నష్టం విషయాన్ని చర్చించారని తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం తన వ్యవసాయ బావి నుంచి ఇంటికి వచ్చి స్నానాల గదికి వెళ్లారు. ఎంతకూ బయటకు రాక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో స్నానాల గది తలుపులు తెరచి చూడగా కాంతరెడ్డి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. పక్కనే పురుగు మందు సీసా ఉంది. వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందారు. మృతుని భార్య భారతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు.

అడ్డగూడూరు, న్యూస్‌టుడే: రెండెకరాల్లో సాగుచేసిన పత్తి పంట ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి లేక తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అప్పుచేసి పెట్టిన పెట్టుబడి తీర్చలేనేమోననే మనస్తాపంతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకీపురంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై మహేశ్వర్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గద్దగూటి అశోక్‌ (50) తన రెండెకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పు భారంగా మారింది. వీటిని తీర్చే విషయంలో కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన అశోక్‌ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పరిసర ప్రాంతాల్లోని రైతులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెద్దకుమారుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని