ప్రవేశాల జోష్‌
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

ప్రవేశాల జోష్‌

సర్కారు బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య

ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వలసలు


అనుముల: అలీనగర్‌ పాఠశాలలో 2018లో 8 మంది విద్యార్థులే ఉండేవారు, గతేడాది

ఈ సంఖ్య 19కి చేరింది. తాజాగా 47 మంది వరకు విద్యార్థులు చేరారు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: సర్కారు బడికి ఆదరణ పెరుగుతోంది. విద్యార్థులు లేక నిరాదరణకు గురై మూతపడిన పాఠశాలలు తెరచుకుంటున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్తు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిన పిల్లలను కొందరు తల్లిదండ్రులు ప్రభుత్వ బడులకు మార్చుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో ఉపాధ్యాయుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

కరోనా తెచ్చిన మార్పు

ఆన్‌లైన్‌ అయినా, ఆఫ్‌లైన్‌ అయినా ప్రయివేట్‌ విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తుండటం, కరోనా మూడో దశ రావచ్చనే అంచనాలే నిజమైతే ప్రత్యక్ష తరగతులు ఎప్పుడు నిలిచిపోతాయో తెలియని పరిస్థితి, కొవిడ్‌ పరిస్థితుల్లో తగ్గిన ఆదాయం, పెరిగిన కుటుంబ పోషణ భారం, కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున ఇరుకు తరగతి గదుల్లో విద్యార్థులను కుక్కితే మహమ్మారి అంటుకునే ప్రమాదం.. తదితర కారణాలతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా వేళ అందుబాటులోకి వచ్చిన యూట్యూబ్‌ వీడియో పాఠాలు వంటివి వినియోగం, ప్రతిభ ఉంటే ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉండటం వల్ల తల్లిదండ్రులు ఆలోచనల్లో పడ్డారు. పైసా ఖర్చు లేకుండా అందుబాటులో ఉన్న విద్యాభ్యాసాన్ని అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టారు. బడిబస్సు ఛార్జీలు, బోధన ఫీజులు, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, ప్రాజెక్టులు, ప్రతిభా పరీక్షలు అంటూ ప్రయివేట్‌ విద్యా సంస్థలు భారీగా డబ్బు గుంజుతున్నాయి. పైగా నియంత్రణ లేక ఏటేటా ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ఇవన్నీ కలిసి దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు అడుగులు వేసే పరిస్థితి ఏర్పడింది. పట్టణ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిన పలువురు చిరుద్యోగులు, కార్మికులు కరోనా వల్ల గ్రామీణ బాట పట్టారు. వారు తమ పిల్లను దగ్గరలోని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

పెరుగుతున్న విద్యార్థులు

* నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలలు 1483 ఉన్నాయి. వీటిల్లో మొత్తం 80,669 మంది విద్యార్థులు చదువుతున్నారు. 4700 మంది వరకు ఈ ఏడాది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు అంచనా.

* నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 17,600 మంది కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జిల్లావ్యాప్తంగా సున్నా విద్యార్థులున్న పాఠశాలలు గతేడాది 163 ఉండేవి. మూడు పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం విద్యార్థులు చేరడంతో ఆ సంఖ్య 160కి తగ్గింది.

* నల్గొండ మండలం శేషమ్మగూడెం ఎస్టీ కాలనీ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల గతేడాది వరకు విద్యార్థులు లేరు. తాజాగా ఆగస్టు 1 నుంచి ప్రారంభమైన ఈ పాఠశాలలో 12 మంది చేరారు.

* చందంపేట మండలం మంగలితండా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సున్నా ఉండగా ప్రస్తుతం 15 మంది చేరారు. ●

* నేరడుగొమ్ము మండలం కాచరాజుపల్లి పాఠశాల సున్నా విద్యార్థులు ఉన్నట్లు దస్త్రాల్లో ఉండగా.. ప్రస్తుతం 16 మంది చేరారు.

* సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 65,704 మంది ఉన్నారు. ఇందులో కొత్తగా పొందిన ప్రవేశాలు 20 వేలకు పైగా ఉన్నాయి.

* జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కరోనాకు ముందు 350 మంది చదివేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 430 గా ఉంది. ఈ నెలాఖరుకల్లా 500కు పైగా ప్రవేశాలు అవుతాయని చెబుతున్నారు.

* యాదాద్రి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 712 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరంలో 44,805 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ప్రస్తుతం ఈ సంఖ్య 49,864కు చేరింది. ఇది మరింతగా పెరిగే అవకాశముంది. జిల్లా పరిధిలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ప్రవేశాల సంఖ్య పెరిగింది. ప్రాథమిక పాఠశాలల్లో ఈ సంఖ్య అధికంగా కనిపిస్తోంది.

* తుర్కపల్లి మండలం మాదాపూర్‌ బీసీ కాలనీ పాఠశాలలో గతంలో 82 మంది ఉండగా ప్రస్తుతం 148 మంది, జడ్పీహెచ్‌ఎస్‌ మాదాపూర్‌లో గతంలో 388 మంది ఉండగా ప్రస్తుతం 410 మంది విద్యార్థులు ఉన్నారు.


సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి

- బి.భిక్షపతి, విద్యాశాఖాధికారి, నల్గొండ

పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు పిల్లల సామర్థ్యాలను పెంపునకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. మంచి వాతావరణం కల్పించి మెరుగైన బోధన అందించాలి. అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్ది పాఠశాలకు, విద్యాశాఖకు మంచి పేరు తేవాలి. సర్కారు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని