వెళ్లిరావయ్యా.. గణపయ్య
eenadu telugu news
Published : 20/09/2021 04:01 IST

వెళ్లిరావయ్యా.. గణపయ్య

ఆహ్లాదంగా శోభాయాత్ర

ఘనంగా నిమజ్జనోత్సవం

నీలగిరి, నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: బ్యాండ్‌ మేళాలు.. డప్పు నృత్యాలు.. కాషాయజెండాల రెపరెపలు.. గణపతిబప్పా మోరియా నినాదాలు.. యువతీ, యువకుల నృత్యాలు.. భజన కీర్తనలు.. ఆర్కేస్ట్రాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. బాణసంచా పేలుళ్లతో గణేశుడికి జిల్లా వాసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండలతో పాటు ప్రధాన పట్టణాల్లో 2,400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని వల్లభరావు చెరువు, 14వ మైలురాయి, వేములపల్లి, కొండభీమనపల్లి, డిండి చెరువుల వద్ద నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇక్కడ పకడ్బందీగా పోలీసు భద్రత కల్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు దారులు మళ్లించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య శోభాయాత్ర, నిమజ్జనోత్సవం జరిగింది. అక్కడక్కడ వర్షం పడుతున్నా లెక్కచేయకుండా యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌, డీటీసీ ఎస్పీ సతీష్‌చోడగిరి, ఏఎస్పీ నర్మద, ఆరుగురు డీఎస్పీలతో పాటు 1200 మంది పోలీస్‌ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎస్పీ స్వయంగా పట్టణంలోని అనేక ప్రాంతాలలో తిరిగి బందోబస్తు పర్యవేక్షించారు.

వల్లభరావు చెరువులో వినాయక విగ్రహం నిమజ్జనం

శనివారం సాయంత్రం నుంచే గణేశ్‌ మండపాల వద్దకు చేరుకున్న పోలీస్‌ సిబ్బంది ఎలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.


వేములపల్లి: సాగర్‌ ఎడమ కాల్వలో..


నల్గొండ: గడియారం స్తంభం సెంటర్‌లో శోభాయాత్రలో పాల్గొన్న జనం


నల్గొండ: శోభాయాత్రలో విజయవాడ కళాకారుల ప్రదర్శన

శివాజీనగర్‌లో యువతల కేరింతలు


ఐక్యతకు నిదర్శనం ఉత్సవాలు: మంత్రి

నల్గొండ: పాతబస్తీలో గణేశునికి పూజలు చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, తదితరులు

నీలగిరి: దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పడానికి గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు నిదర్శనమని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నిమజ్జన శోభాయాత్రను పట్టణంలోని పాతబస్తీ ఒకటో నంబర్‌ విగ్రహం వద్ద పూజలు జరిపి ప్రారంభించారు. అన్ని వర్గాల వారు ఉత్సవాలలో పాల్గొనడం విశేషమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌, పురపాలిక ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌గౌడ్‌, ఉత్సవ సమితి అధ్యక్షుడు నేతి రఘుపతి, ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన వెంకట్‌, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


రూ.6 లక్షలు పలికిన లడ్డూ

నీలగిరి: నల్గొండ పట్టణంలోని ఒకటో విగ్రహం లడ్డూకు వేలం పాట రూ.6 లక్షలు పలికింది. గత ఏడాది తెరాస నాయకుడు పిల్లి రామరాజు రూ.6.15 లక్షలకు దక్కించుకొన్నారు. ఈ సారి రూ.6లక్షలకు స్వామి భక్తుడు బొడ్డుపల్లి సతీష్‌ రూ.6 లక్షలకు పొందారు. ప్రతి సారి వేలం పాటలో పాల్గొంటున్నా ఈ సారి అందరికన్నా ఎక్కువగా పాటపాడిన సతీష్‌కు లడ్డూ దక్కింది. ఈ లడ్డూను మంత్రి జగదీశ్‌రెడ్డి సతీష్‌కు అందజేశారు.


ఆహ్లాదంగా శోభాయాత్ర

ఘనంగా నిమజ్జనోత్సవం

భువనగిరి, భువనగిరి గంజ్‌, యాదాద్రి, న్యూస్‌టుడే: కాషాయజెండాల రెపరెపలు.. డప్పు వాయిద్యాలు.. గణపతి బప్పా మోరియా నినాదాలు.. యువతీ, యువకుల నృత్యాలు.. భజన కీర్తనలు.. ఆర్కేస్ట్రాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. బాణసంచా పేలుళ్ల నడుమ గణనాథులకు ఆదివారం జిల్లావాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాలోని భువనగిరి, భూదాన్‌ పోచంపల్లి, చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు పురపాలికల్లో నిమజ్జనం యాత్ర వైభవంగా జరిగింది. జిల్లాల్లో 15 కీలక నిమజ్జన ప్రాంతాలను గుర్తించి పోలీసులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షంతో శోభాయాత్రకు అంతటా అంతరాయం కలిగింది. ఒక్కరోజే అన్ని మండలాల్లో సుమారు వెయ్యి గణపతి విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. సోమవారం గ్రామాల్లో మరికొన్ని విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య శోభాయాత్ర, నిమజ్జనోత్సవం జరిగింది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ యాత్రలో పాల్గొన్నారు. చౌటుప్పల్‌లో పెద్దకొండూరు, మల్కాపూర్‌ చెరువుల్లో నిమజ్జనం క్రతువు చేపట్టారు. కొన్ని విగ్రహాలను శ్రీశైలం తీసుకెళ్తున్నారు. యాదగిరిగుట్టలో ఆదివారం రాత్రి శోభాయాత్ర ప్రారంభమైంది. పట్టణ శివారులోని చాకలిగిద్దె చెరువులోకి గణనాథులను తరలించారు. ఆలేరు పురపాలికలో నెలకొల్పిన కొన్ని విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి బహదూర్‌పేట చెరువులో నిమజ్జనం చేశారు. భువనగిరి పెద్ద చెరువు వద్ద అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఆర్డీవో సూరజ్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీసీపీ నారాయణరెడ్డి, అదనపు డీసీపీలు భుజంగరావు, లక్ష్మీనారాయణ పోలీసు బందోబస్తును పరిశీలించారు. దాదాపు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం జరిగిందని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగే అవకాశం ఉంది.

● పెద్దచెరువు దగ్గర విగ్రహాన్ని మోసుకెళ్తున్న దృశ్యం

జైజై గణేశా.. బైబై గణేశా

ఏటా మాదిరిగానే గణేశ్‌ నిమజ్జన యాత్ర భువనగిరి పట్టణలో వైభవంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన శకటాలు, కనులు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులతో సాయంత్రం శోభాయాత్ర ప్రారంభమైంది. గణనాథుడిని భక్తులు జేజేలు పలుకుతూ సాగనంపారు. జైజై గణేశా.. బైబై గణేశా అంటూ ముందుకు సాగారు. ఓ వైపు వర్షం పడుతున్నా పట్టణవాసులు పెద్ద సంఖ్యలో ప్రధాన రహదారిపైకి చేరుకొని శోభాయాత్రను తిలకించారు. గణపతులకు హారతులు నివేదించారు. పట్టణంలో సుమారు 280కి పైగా విగ్రహాలను నెలకొల్పగా.. ఆదివారం సాయంత్రం వరకు 30కి పైగా విగ్రహాలను పెద్దచెరువులో నిమజ్జనం చేశారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి స్రిగ్ధ కాలనీలో, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, టీపీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌తో కలిసి ఆర్బీనగర్‌లోని పలుచోట్ల పూజల్లో పాల్గొన్నారు.

నృత్యం చేస్తున్న యువతులు

భువనగిరి: హన్మాన్‌వాడలో వినాయకుడి శోభాయాత్ర

సాయియూత్‌ ఆధ్వర్యంలో కేరళ వాయిద్యాలు వాయిస్తున్న కళాకారులు

భువనగిరి: ఆర్బీనగర్‌లో బొమ్మకారుపై బాలగణేశ్‌ శోభాయాత్రలో పిల్లల కేరింత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని